మాటల మాంత్రికుడు శశి థరూర్‌ మామూలోడు కాదు.. అప్పుడు మోదీ కన్నా ఎక్కువ ఫాలోయింగ్‌

1 Oct, 2022 09:19 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో నిలిచిన మాటల మాంత్రికుడు శశి థరూర్‌ (66) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాను ఎవరో ఆడించినట్లు ఆడే తోలుబొమ్మను కాదని చెబుతున్నారు. విభిన్న రాజకీయవేత్తగా థరూర్‌కు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన చుట్టూ వివాదాలకు లెక్కలేదు. శశి థరూర్‌ 1956 మార్చి 9న లండన్‌లో జన్మించారు. ఢిల్లీలోని ప్రఖ్యాత సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో హిస్టరీలో ఆనర్స్‌ పూర్తిచేశారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికాలోని మెడ్‌ఫోర్డ్‌లో ఫ్లెచర్‌ స్కూల్‌ ఆఫ్‌ లా అండ్‌ డిప్లొమసీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ అభ్యసించారు. అక్కడే 1978లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. అనంతరం ఐక్యరాజ్యసమితిలో చేరారు. రష్యా–పశ్చిమ దేశాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక శాంతి స్థాపన కోసం కృషి చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శికి సీనియర్‌ సలహాదారుగా సేవలందించారు.

ఐరాసలో కమ్యూనికేషన్స్‌ అండ్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అండర్‌ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు. 2006లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా భారత్‌ తరఫున అధికారిక అభ్యర్థిగా పోటీపడ్డారు. రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో సెక్రెటరీ జనరల్‌గా దక్షిణ కొరియా రాజకీయ నాయకుడు బాన్‌ కీ మూన్‌ విజయం సాధించారు. 2009లో అంతర్జాతీయ సివిల్‌ సర్వెంట్‌గా థరూర్‌ పదవీ విరమణ పొందారు. ఇండియాలో అడుగుపెట్టారు. అదే ఏడాది రాజకీయాల్లోకి ప్రవేశించారు.

2009లో తొలిసారిగా కాంగ్రెస్‌ టికెట్‌పై కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. యూపీఏ సర్కారు హయాంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2010 ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. 2014 జనవరిలో ఆయన భార్య సునంద పుష్కర్‌ ఓ హోటల్‌లో శమమై కనిపించడం దేశంలో సంచలనం సృష్టించింది. ఆయనపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.

అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు
సునంద పుష్కర్‌ మృతి కేసులో ఢిల్లీ కోర్టు గత ఏడాది థరూర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 2014, 2019 ఎన్నికల్లోనూ తిరువనంతపురం నుంచి ఆయన విజయం సాధించారు. రచయితగా థరూర్‌కు అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు ఉన్నాయి. 23 పుస్తకాలు రాశారు. పులు పురస్కారాలు అందుకున్నారు. ఇందులో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఉండడం విశేషం. థరూర్‌ ఒక దశలో కాంగ్రెస్‌ నాయకత్వం తీరుపై నిప్పులు చెరిగారు. జి–23 గ్రూప్‌ నేతల్లో ఒకరిగా అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సంస్కరణల ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడంలో థరూర్‌ దిట్ట. 2013 దాకా ట్విట్టర్‌లో అత్యధిక ప్రజాదరణ ఉన్న ఇండియన్‌ లీడర్‌ థరూరే కావడం గమనార్హం. ఆ తర్వాత ఆ స్థానాన్ని నరేంద్ర మోదీ ఆక్రమించారు.
చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో గాంధీల వీరవిధేయుడు

మరిన్ని వార్తలు