ఏసీ గదుల్లో కూర్చుని, ట్వీట్లు చేయడం కాదు..

24 Dec, 2020 20:48 IST|Sakshi

ముంబై: కాంగ్రెస్‌ పార్టీతో తనకెన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని శివసేన నాయకురాలు ఊర్మిళ మటోంద్కర్ అన్నారు. పార్టీని వీడినంత మాత్రాన విమర్శించాల్సిన అవసరం లేదని, తనకు అలాంటివి నచ్చవని పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్మిళ మాట్లాడుతూ.. తన రాజకీయ, సినీ జీవితానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ‘‘ఆర్నెళ్ల కంటే తక్కువ కాలమే ఆ పార్టీతో కలిసి పనిచేశాను. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 28 రోజులు క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాను. నిజానికి నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు. కానీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్న తర్వాత వారి ఆఫర్‌ స్వీకరించడం సరైంది కాదు. 

అందుకే నేనేమీ మాట్లాడలేదు. వారిని నిందించడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా లేదు. వివేకం, విచక్షణతో మెలగడమే నాకు అత్యంత ముఖ్యమైనది. కేవలం ఓటమి కారణంగా కాంగ్రెస్‌ పార్టీని వీడానన్న వార్తల్లో నిజం లేదు. ప్రేక్షకులు నన్ను సినిమా స్టార్‌ను చేశారు. నేను ప్రజా నాయకురాలిని కావాలనుకున్నాను. ఏసీ గదుల్లో కూర్చుని, ట్వీట్లు చేయడం నాకు సరిపడదు. కులమతాలకు అతీతంగా అందరికీ సేవ చేయడమే నాకు ముఖ్యం’’ అని చెప్పుకొచ్చారు. ఇక శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసిన మహావికాస్‌ అఘాడి(ఎంవీఏ) ప్రభుత్వ పనితీరుపై ఊర్మిళ ప్రశంసలు కురిపించారు. (చదవండి: నన్ను నా భర్తను లక్ష్యం‍గా చేసుకుని..)

‘‘ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఏడాది పాలన అత్యద్భుతం. కోవిడ్‌-19, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన చర్యలు అమోఘం’’ అని పేర్కొన్నారు. ఇక తాను శివసేనలో చేరడం గురించి మాట్లాడుతూ.. ‘‘పదవిని ఆశించి పార్టీలో చేరలేదు. ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్‌, శివసేన సిద్ధాంతాలు వేర్వేరు. సెక్యులర్‌ అన్న పదానికి ఇటీవల కాలంలో అర్థం మారింది. సెక్యులరిస్టు అంటే ఏ మతాచారాన్ని పాటించని వారు అని ఎక్కడా లేదు. శివసేన హిందుత్వ పార్టీ అయినంత మాత్రాన ఇతరులను ద్వేషించడం లేదు. హిందూమతం గొప్పది’’ అని ఊర్మిళ తెలిపారు. కాగా శివసేన, గవర్నర్‌ కోటా కింద ఆమెను శాసన మండలికి నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక తన సినీ కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌కు ముందు ఓ వెబ్‌సిరీస్‌కు సైన్‌ చేశానని, అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని ఊర్మిళ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు