రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు: ఉత్తమ్‌ 

1 Aug, 2020 04:37 IST|Sakshi

గజ్వేల్‌ ఘటనలో తప్పు కప్పిపుచ్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ యత్నం

త్వరలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలుస్తాం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గంలో దళిత రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దురదృష్టకరమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. జూమ్‌ యాప్‌ ద్వారా శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత రైతుకు ఉన్న 13 గుంటల భూమిని ప్రభుత్వం లాక్కున్న కారణంతోనే ఆ రైతు మరణించాడని అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలున్నాయని అక్కడి ప్రజలు అనుకుంటున్నారని, రైతు మరణించిన తరువాత ఎకరా భూమి ఇస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు.

గజ్వేల్‌ ఘటనపై టీఆర్‌ఎస్‌ నేతలు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 13 శాతం జనాభా ఉన్న దళితులకు కేసీఆర్‌ కేబినెట్‌లో స్థానం లేదని, ఒకట్రెండు శాతం జనాభా ఉన్న వారికి మాత్రం రెండు, మూడు మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇసుక లారీతో తొక్కించి ఒక యువకుడిని చంపించడం కంటే దారుణం ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దళిత నాయకుడిగా ఎన్నోసార్లు ఎన్నికయ్యారని, తప్పుడు ప్రకటనలు చేసి మంత్రి తన స్థాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు.

కేసీఆర్‌ సీఎం అయ్యారంటే దళితులు, గిరిజనులే కారణమని మర్చిపోవద్దని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై హింసాకాండ రోజూ జరుగుతోందని, రాష్ట్రంలో పోలీసులు నిజాయితీగా ఉన్నా కొంతమంది ఉన్నతాధికారుల వల్ల దళితుల ఘటనల్లో న్యాయం జరగడం లేదని ఆరోపించారు. దళితులపై జరుగుతున్న వరుస ఘటనలపై రాష్ట్ర గవర్నర్‌తో పాటు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలుస్తామని చెప్పారు. దళితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా