దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం 

17 Oct, 2020 07:02 IST|Sakshi
మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి 

అబద్ధాలకోరు టీఆర్‌ఎస్‌ను ఓడించండి: ఉత్తమ్‌  

బీజేపీకి ఓటు వేయడం వృథా

కాంగ్రెస్‌కు పట్టం కట్టండని విజ్ఞప్తి 

సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం వ్యాపిస్తోందని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోందని, టీఆర్‌ఎస్‌ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగు పడుతాయని యువకులు, విద్యార్థులు ఉద్యమంలో పాల్గొని బంగారు భవిష్యత్‌ను ఫణంగా పెట్టారన్నారు. తీరా రాష్ట్రం ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల కుటుంబమే బాగు పడిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మాజీ మంత్రి ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధే కన్పిస్తుందని, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అక్రమ సంపాదన డబ్బులు ఎన్నికల్లో ఖర్చు చేయడం టీఆర్‌ఎస్‌కు రివాజుగా మారిందన్నారు. తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయం ఆయన గుర్తు చేశారు. 2014, 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్‌ ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. అబద్ధాలకోరు టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని, ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసి అర్హులైన వారందరి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దుబ్బాక ఫలితాల వైపు రాష్ట్రం మొత్తం చూస్తోందని, సంచలన తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. బీజేపీకి గ్రామాల్లో ఓటర్లే లేరన్నారు. మూడో స్థానంలో నిలిచే బీజేపీకి ఓటు వేయడం వృథా అన్నారు.


శుక్రవారం దుబ్బాక మండలం పెద్ద చీకోడులో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి
రైతుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం 
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతుల్లో ఆర్థికంగా బలోపేతం అవుతామనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని పెద్ద చీకోడు, రామక్కపేట గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలసి శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్‌ నాయకులు సూట్‌కేసులు సర్దుకొని వచ్చారని, అయితే ఇక్కడ క్యాడర్‌ లేకపోవడంతో దారి చూపించే నాథుడే కరువయ్యారని విమర్శించారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడైనా దుబ్బాకకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఏనాడూ రాని నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం వస్తే ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తుండటంతో తాము ప్రజలకు చేరువయ్యామని పేర్కొన్నారు. ఇక్కడ అభివృద్ధిని చూసి ఏం చేయాలో అర్థంకాని కాంగ్రెస్‌ నేతలు మాయ మాటలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు. ఆపదలో, సంపదలో అందుబాటులో ఉండే నాయకుడికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర నిధులు ఏవీ? 
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెబుతున్న బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆసరా పెన్షన్లలో వారు ఇచ్చే వాటా ఎంత? అని ప్రశ్నించారు. ఒక వేళ ఈ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తే.. బీజేపీ పాలిత 17 రాష్ట్రాలలో ఇక్కడి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గ్లోబల్‌ ప్రచారంలో బీజేపీకి నోబెల్‌ బహుమతి ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీతో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార సభలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 
దుబ్బాకలో ముగిసిన నామినేషన్ల ఘట్టం 
దుబ్బాక టౌన్‌: దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. 9వ తేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన విషయం విదితమే. మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం 34 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు