ఓట్ల కోసమే ‘విమోచనాన్ని’ విస్మరించారు 

18 Sep, 2020 05:50 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు 

సాక్షి, హైదరాబాద్‌/సుల్తాన్‌బజార్‌: టీఆర్‌ఎస్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం కోఠిలోని అమరవీరుల అశోక స్తూపం వద్ద, గాంధీ భవన్‌లోనూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోవడం తెలంగాణ ప్రజల హక్కు అని, ప్రభుత్వం ఓట్ల రాజకీయం కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. భారతదేశంలో తెలంగాణ విలీనం కావడంలో బీజేపీ, ఎంఐఎంలకు ఏం సంబంధం ఉందని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం కావడంలో కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్టుల పాత్ర మాత్రమే ఉందని, ఇందులో ఈ రెండు మతతత్వ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇచ్చినమాట నిలబెట్టుకునే కాంగ్రెస్‌ పార్టీతోనే నాడు దేశంలో తెలంగాణ విలీనమైందని, అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క కుటుంబానిదే పెత్తనం అయిందని విమర్శించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొని ఏకస్వామ్య విధానానికి చరమగీతం పాడేందుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమాల్లో భట్టి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, మర్రి శశిధర్‌ రెడ్డి, కుసుమకుమార్, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా