ఎస్పీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను... బీజేపీ తరిమికొట్టింది: అమిత్‌ షా

30 Jan, 2022 06:03 IST|Sakshi

ముజఫర్‌నగర్‌: యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను బీజేపీ ప్రభుత్వం తరిమికొట్టిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అఖిలేష్‌ యాదవ్, జయంత్‌ చౌదరి కలిసి ప్రచారంలో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ ఆ రెండు పార్టీలది ఎన్నికల బంధమేనని, ఆ తరువాత ఎవరిదారి వారిదేనని ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడినా ఆజంఖాన్, అతిఖ్‌ అహ్మద్‌ లాంటివాళ్లు వేదికపై ఉంటారే తప్ప... జయంత్‌ ఎక్కడా కనిపించరని జోస్యం చెప్పారు.

బాధితులనే నిందితులుగా చేసిన 2013 ముజఫర్‌నగర్‌ అల్లర్లను ఎవరైనా మరచిపోగలరా? అని అమిత్‌ షా ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో నేరాలు తగ్గాయని, ఈ విషయంలో గణాంకాలతో సహా చర్చకు తాము సిద్ధమని, ఎస్పీ ప్రభుత్వంలోని గణాంకాలతో అఖిలేష్‌ ముుందుకొస్తారా అని సవాల్‌ విసిరారు. అఖిలేష్‌ ప్రభుత్వ పాలనకు ముజఫర్‌ నగర్‌ అల్లర్లు సజీవ సాక్షమన్నారు. అల్లర్ల సమయంలో పోలీసులు.. తప్పుడు కేసులు బనాయించారని, బాధితులనే నిందితులుగా చేసే ప్రయత్నం జరిగిందని తెలిపారు. కోర్టుల్లోనూ, రోడ్ల మీద న్యాయం కోసం పోరాడిన బీజేపీ నేత సంజీవ్‌ బలియాన్‌ని అమిత్‌ షా అభినందించారు.  

మళ్లీ అదే తప్పు చేయొద్దు...
ఉత్తరప్రదేశ్‌ను ఎస్పీ చేతిలో పెట్టి ప్రజలు మళ్లీ తప్పు చేయొద్దని, అదే జరిగితే మరో ముజఫర్‌నగర్‌ ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ గెలుపొందితే ఎలాంటి అల్లర్లు ఉండవని, 300 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ఒక పార్టీ గురించే మాట్లాడుతుందని, కాంగ్రెస్‌ ఒక కుటుంబం గురించే మాట్లాడుతుందని, ఇక ఎస్పీ అధికారంలోకి వస్తే గూండాలు, మాఫియా రాజ్యంగా మారిపోతుందని, ఒక్క బీజేపీ మాత్రమే భద్రత, అభివృద్ధి గురించి మాట్లాడుతుందని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనది, దాన్ని యూపీ ప్రజలు తెలివిగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా యూపీ నిలుస్తుందన్నారు. దేశభద్రత బీజేపీ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. అఖిలేష్‌ యాదవ్‌ రైతులకు వరాలు కురిపిస్తున్నారని, కానీ ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలోనే 21 చక్కెర కర్మాగారాలు మూసివేశారని ఎద్దేవా చేశారు. ముజఫర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి కపిల్‌ దేవ్‌ అగర్వాల్‌ పోటీ చేస్తుండగా, ఎస్పీ– ఆర్‌ఎల్డీ కూటమి నుంచి సౌరభ్‌ స్వరూప్‌ బరిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు