Mayawati: నాడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.. మరి నేడు..

29 Jan, 2022 08:48 IST|Sakshi

కీలక నేతలు

ఒకప్పుడు రాజసంతో యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దళిత బిడ్డ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నేడెందుకో మౌన ప్రేక్షకురాలి పాత్రకు పరిమితమయ్యారు. ఆ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు ఎవరి ఊహకి అందని విధంగా యూపీ ప్రజల్ని మాయ చేశారు. అగ్రవర్ణాలు, దళితులు అనే సోషల్‌ ఇంజనీరింగ్‌ వ్యూహంతో ఎన్నికల్లో కాకలు తీరిన యోధులకే కొత్త పాఠాలు నేర్పించారు. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆమె ఆప్త మిత్రులనైనా పక్కన పడేయగలరు. ఆగర్భ శత్రువులతోనైనా చేయి కలపగలరు.

సామాజిక కార్డుతోనే యూపీతో సహా దేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అభిమానులు బెహన్‌జీ అని ఆప్యాయంగా పిలుచుకొనే మాయావతి శక్తిసామర్థ్యాలు ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి అన్నచందంగా మారింది. ప్రస్తుతం ఆమె ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉన్నారు. యూపీలో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ మధ్య సాగుతూ ఎన్నికల కాక రగులుతూ ఉంటే మాయావతి వ్యూహాలేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాజకీయంగా అత్యంత అనుభవజ్ఞురాలు, అత్యంత శక్తిమంతమైన మహిళగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాయకురాలు, ఒకప్పుడు ప్రధాని పదవికి సైతం పోటీదారుగా నిలువాలని ఆశించిన మాయావతి.. ఈసారి మౌనం దాల్చడం వెనుక ఎలాంటి మాయ దాగుందోనన్న చర్చ జరుగుతోంది.  

ఢిల్లీలోని నిరుపేద దళిత కుటుంబంలో 1956 సంవత్సరం జనవరి 15న జన్మించారు.  
ఘజియాబాద్‌లోని ఢిల్లీ యూనివర్సిటీలో లా డిగ్రీ చేసిన మాయావతి ఐఏఎస్‌ కావాలని కలలు కన్నారు.  
1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో టీచర్‌గా చేశారు 
దళిత నాయకుడు కాన్షీరామ్‌తో 1977లో పరిచయం ఏర్పడింది 
కాన్షీరామ్‌ 1984లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి తీసుకున్నారు.  
రాజకీయ రంగప్రవేశంతో ఆమె జీవితమే మారిపోయింది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.  
మాయావతికి మొదట్లో అపజయాలే ఎదురయ్యాయి. 1985లో తొలిసారి లోక్‌సభకు పోటీపడినప్పుడు ఆమె ఓడిపోయారు. 1987లో మళ్లీ ఓటమిపాలయ్యారు. 1989లో యూపీ శాసనమండలికి ఎన్నికయ్యారు 
కాన్షీరామ్‌ అనారోగ్యం బారినపడడంతో 1995లో బీఎస్పీ పగ్గాలు చేపట్టారు. 
1998, 1999, 2004లో వరుసగా మూడుసార్లు లోక్‌సభకు, మరో మూడు పర్యాయాలు (1994–2012 మధ్య) రాజ్యసభకు ఎన్నికయ్యారు.  
తొలిసారిగా 1995 సంవత్సరం నాలుగు నెలల పాటు యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక దళిత మహిళ అత్యున్నత స్థాయి పదవిని అందుకోవడం అదే తొలిసారి.  
ఆ తర్వాత మరో రెండు సార్లు స్వల్పకాలం సీఎంగా కొనసాగారు. 1997లో ఆరు నెలలు, 2002–03లో 17 నెలలు సీఎం పదవిలో ఉన్నారు 
గురువు కాన్షీరామ్‌ 2006లో కన్నుమూసినప్పుడు మాయావతి స్వయంగా ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 
2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టి పూర్తిగా అయిదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు 
ఈ అయిదేళ్ల కాలంలో ఆమె ప్రభ మసకబారడం ప్రారంభించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు, అధికారాన్ని ఉపయోగించుకొని బల ప్రదర్శన, డజనుకు పైగా విమానాలు, హెలికాప్టర్లను ప్రచారానికి వినియోగించడం, తాజ్‌ హెరిటేజ్‌ కారిడార్‌లో అవకతవకలు వంటివెన్నో వివాదాస్పదమయ్యాయి.  
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన విగ్రహాలు, పార్టీ చిహ్నం ఏనుగు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టించడం, పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేసుకోవడం, కార్యకర్తలు వేసే కరెన్సీ దండల్ని స్వీకరించడం, పాలనా వైఫల్యాలు వంటివన్నీ ఆమెపై తీవ్ర వ్యతిరేక భావాన్ని పెంచాయి. నిమ్నకులాలకి  చేసిందేమిటన్న ప్రశ్నలు వచ్చాయి.  
2017 శాసనసభ ఎన్నికల్లో కేవలం 19 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆగర్భ శత్రువైన ఎస్పీతో పొత్తు పెట్టుకొని బీఎస్పీ 10 స్థానాలు దక్కించుకోగలిగింది.  
ఈసారి ఎన్నికల్లో మాయావతి పార్టీ పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలోనూ, మ్యానిఫెస్టో విడుదలలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ ఎందులోనూ స్పీడ్‌ కనిపించడం లేదు. 
అయినప్పటికీ సంప్రదాయంగా తమకు వచ్చే 20% ఓటు బ్యాంకుపైనే మాయావతి ఆశలు పెట్టుకున్నట్టుగా బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.  
– నేషనల్‌ డెస్క్‌ సాక్షి 

మరిన్ని వార్తలు