బీజేపీకి షాకిచ్చేలా.. మాస్టర్‌ స్ట్రోక్‌.. మైండ్‌గేమ్‌!

15 Jan, 2022 04:37 IST|Sakshi

వ్యూహరచనలో ఆరితేరిన బీజేపీకి షాకిచ్చేలా అఖిలేశ్‌ ఎత్తులు

విడతల వారీగా చేరికలకు ప్లాన్‌ చేసి... మైండ్‌గేమ్‌

ఓబీసీలు, దళితులను బీజేపీ     అవమానిస్తోందని ప్రజల్లోకి బలమైన సందేశం పంపే ఎత్తుగడ

ఊగిసలాటలో ఉన్న నాయకులు... నిర్ణయానికి వచ్చేలా ఎస్పీ బలపడుతోందనేది చాటిచెప్పే ప్రయత్నం

తద్వారా భారీగా వలసలకు ఆస్కారం

బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేలా మాస్టర్‌ప్లాన్‌  

ఉత్తరప్రదేశ్‌లో ఏదో జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా బీజేపీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఈ వలసలేమిటి? ఒకరివెంట మరొకరు పోటీలుపడి ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని ఎందుకు వీడుతున్నారు. బీసీల ప్రయోజనాలను సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే కాపాడగలదా? బీజేపీ మునిగిపోయే నౌకా? 

నాయకగణంలో, జనసామాన్యంలో ఇప్పుడీ అభిప్రాయం బలపడుతోంది. బీజేపీలో ‘ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌’ అనేది బాగా ప్రబలింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బృందానికి సరిగ్గా ఇదే కావాలి. అంతా వారనుకున్నట్లే జరుగుతోంది. ఆడించినట్లే రక్తి కడుతోంది. వ్యూహరచనలో, క్షేత్రస్థాయిలో తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ పెద్దలకు అఖిలేశ్‌ ఇచ్చిన గట్టి ఝలక్‌ ఇది. ఎన్నికల నగారా మోగాక.. అసలుసిసలు ‘సినిమా’ చూపిస్తున్న వైనమిది.

ఇదంతా ఈనెల 11న ప్రముఖ ఓబీసీ నేత, మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్యతో మొదలైంది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. మౌర్య మద్దతుదారులైన నలుగురు ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు. చిన్న అలజడి మొదలైంది. 12న మరో ఓబీసీ ముఖ్యనేత, మంత్రి దారాసింగ్‌ చౌహాన్‌ బీజేపీకి టాటా చెప్పారు. 13న మరో ఓబీసీ నేత ధరమ్‌సింగ్‌ సైనీ కాషాయదళాన్ని వీడారు.

మూడురోజుల్లో ముగ్గురు మంత్రులు... ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీని విడిచి వెళ్లిపోయారు. చిన్న పాయ కాస్తా ముందుకెళ్లిన కొద్దీ నదిగా మారుతున్న దృశ్యం గోచరమవుతోంది. బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్‌ (సోనేలాల్‌)కూ సెగ తగిలింది. ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్పీ పంచన చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ కప్పదాట్లు సహజమే అయినా... నలుగురైదుగురు పోతే ఫర్వాలేదు.

అలాకాకుండా కీలక ఓబీసీ నేతలు పక్కా ప్రణాళిక ప్రకారం బీజేపీని టార్గెట్‌ చేస్తూ... కాషాయదళంలో ఓబీసీలను, దళితులను చిన్నచూపు చూస్తున్నారనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ‘బౌన్సర్లు’ వేస్తున్నారు. ఆల్‌రౌండర్‌ ఆదిత్యనాథ్‌ యోగి (రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల యూపీ సీఎంను క్రికెట్‌ పరిభాషలో ఆల్‌రౌండర్‌గా అభివర్ణించారు), జట్టు కెప్టెన్‌ జేపీ నడ్డా (బీజేపీ అధ్యక్షుడు), కోచ్‌... అమిత్‌ షా (ప్రధాన వ్యూహకర్త)లకూ అఖిలేశ్‌ టీమ్‌ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉంది.  

పసిగట్టలేకపోయారా? ఫర్వాలేదనుకున్నారా?
ఎన్నికల వేళ ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా అప్రమత్తంగా ఉంటుంది. అసంతృప్తులు, అనుమానం ఉన్నవారి కదలికలపై నిఘా ఉంటుంది. వారేం చేస్తున్నారు... ఎవరిని కలుస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతాయి. అలాంటిది కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండి, ఐబీ, రాష్ట్ర నిఘా విభాగాలు రాబోయే ఈ వలసల ఉద్యమాన్ని ఎందుకు పసిగట్టలేకపోయాయి.

ఒకవేళ కొంత సమాచారం ఉన్నా ఆ పోతే ఒకరిద్దరు పోతారు, దాంతో మనకొచ్చే నష్టమేముందని బీజేపీ అగ్రనేతలు తేలిగ్గా తీసుకున్నారా? ఈ స్థాయి ప్రణాళికాబద్ధమైన దాడిని ఊహించలేకపోయారా?. ఇప్పుడు నష్టనివారణకు దిగి ఎస్పీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరిని చేర్చుకున్నా జరిగిన డ్యామేజీని ఇలాంటివి పూడుస్తాయా? కసికొద్దీ ఇంకా కొంతమందిని లాగినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

చెప్పి... మరీ!
ఈనెల 11న మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య రాజీనామా చేయగానే నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌పవార్‌ మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, ఇంకొందరు నేతలు ఎస్పీలోకి వస్తారని ప్రకటించారు. జనవరి 20వ తేదీదాకా బీజేపీలో రోజుకు ఒకటి రెండు వికెట్లు పడుతూనే ఉంటాయని, 20న నాటికి బీజేపీని వీడిన మంత్రులు, ఎమ్మెలేల సంఖ్య 18కి చేరుతుందని ఎస్పీ మిత్రపక్షమైన సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్‌ రాజ్‌బర్‌ బుధవారం ప్రకటించారు. 20 దాకా రాజీనామాల పరంపర కొనసాగుతుందని, రోజుకొక మంత్రి, ఎమ్మెల్యే కాషాయపార్టీకి గుడ్‌బై చెబుతారని రాజీనామా చేస్తూ మంత్రి ధరమ్‌సింగ్‌ గురువారం చెప్పారు. భవిష్యత్తు చేరికలపై ఎస్పీ మాట్లాడకుండా... బయటి వారు మాట్లాడుతుండటం... ఇదంతా ఒక విస్తృత అవగాహనతో జరుగు తోందనేది దానికి అద్దం పడుతోంది.
 
నిజానికి పార్టీ మారేటపుడు ఎవరూ అంత ఆషామాషీగా అడుగు వేయరు. భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైన భరోసా, తాము కోరిన నియోజకవర్గాల్లో తమ వారికి టికెట్లు ఖరారు చేసుకున్నాకే... బయటపడతారు. రాజీనామా చేస్తారు. అంటే అఖిలేశ్‌ వీరిందరితో ఎంతోకాలంగా టచ్‌లో ఉన్నట్లే లెక్క. పైగా ఎవరెవరు వస్తే ప్రయోజనం, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వగలం... అనేది బాగా కసరత్తు చేశారు ఎస్పీ చీఫ్‌.

అధికార, బీజేపీ వేగులకు ఉప్పందకుండా ఎంతో జాగ్రత్తగా ఈ డీల్‌ను పూర్తి చేయడం అఖిలేశ్‌ వయసుతో పాటే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరారనే విషయాన్ని చాటిచెబుతోంది. ఇది ఒక ఎత్తైతే... తమ ప్రణాళికను అమలులో పెట్టిన తీరు బీజేపీ చాణక్యులనే నివ్వెరపరుస్తుండొచ్చు. అఖిలేశ్‌ను కలవడం... ఫొటోలు దిగడం, బయటకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు తాము బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోతోంది.

వీరి రాజీనామా ప్రకటన వెలువడిందో లేదో నిమిషాల్లో అఖిలేశ్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌ వారు ఎస్పీ చీఫ్‌తో దిగిన ఫొటోలు ప్రత్యక్షమవుతున్నాయి. అంతా కట్టగట్టుకొని ఏ 20 మందో ఒకేసారి బీజేపీని వీడితే... అది ఒక్కరోజుకే టీవీ చానళ్లకు, పత్రికలకు వార్త అవుతుంది. మరుసటి రోజు ఫోకస్‌ వేరే అంశాలపైకి మళ్లుతుంది. అలాకాకుండా విడతల వారీగా వలసలు చోటుచేసుకుంటే రోజూ మీడియాలో సమాజ్‌వాదీ కవరేజీయే. పత్రికల్లో, టీవీల్లో రోజూ ఎస్పీలో చేరికలపై వార్తలు ఉంటే... ప్రజల్లోకి ఒకరకమైన సానుకూల సందేశం వెళుతుంది.

బీజేపీ అధికార, అంగ, అర్థబలాన్ని ఎదుర్కొనగలమా అని లోలోపల సంశయంలో ఉన్న ఎస్పీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతాయి. వారు ద్విగుణీకృత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. ప్రజల్లోనూ ఎస్సీకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే భావన వస్తే... తటస్థ ఓటర్లు కూడా కొంతమేరకు సైకిల్‌ వైపు మొగ్గే అవకాశాలుంటాయి. అన్నింటికంటే ముఖ్యమైన అంశం... తమకు ఎదురులేదనే భావనలో ఉన్న బీజేపీని ఈ అనూహ్య పరిణామాలు ఆత్మరక్షణలోకి నెట్టేస్తాయి. ఊగిసలాటలో ఉన్న నాయకులు ఎస్సీవైపు చూసేలా ఈ పరిణామాలు ప్రోత్సహిస్తాయి.

ఎవరుంటారో... ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో బీజేపీ సొంత నాయకులనే అనుమాన చూపులు చూసే పరిస్థితి. ఒక్కసారి గనక బీజేపీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయం బలపడితే... మునిగే నౌకలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. కమలదళానికి సరైన ప్రత్యామ్నాయంగా ఉన్న ఎస్పీలోకి నాయకులు క్యూ కడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే అఖిలేశ్‌ విడతల వారీగా బీజేపీని దెబ్బకొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారు. చక్కటి మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ తదుపరి ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి.   

– నేషనల్‌ డెస్క్, సాక్షి        

మరిన్ని వార్తలు