UP Assembly Election 2022: ఖద్దరు చొక్కాకై ఖాకీ తహతహ!

18 Jan, 2022 04:05 IST|Sakshi

రాజకీయ అరంగ్రేటం చేస్తున్న బ్యూరోక్రాట్‌లు

యూపీ ఎన్నికల్లో పోటీకై ఐపీఎస్‌కు  ఆశిమ్‌ అరుణ్‌ రాజీనామా

బీజేపీలో చేరిక.. కన్నౌజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సై

బీజేపీలోకి మరో మాజీ ఐఏఎస్‌ రామ్‌ బహదూర్‌

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో అనేకమంది బ్యూరోక్రాట్‌లు తమ రెండో ఇన్సింగ్స్‌ను రాజకీయాల్లో మొదలు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఖద్దరు చొక్కా వేసుకొని ప్రజలకు మరింతగా సేవ చేసుకోవాలని ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఇటీవలే ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేసినా ఆశిమ్‌ అరుణ్‌ రెండ్రోజుల కిందటే బీజేపీలో చేరడం, ఆయనతో పాటు మారో మాజీ ఐఏఎస్‌ రామ్‌ బహదూర్‌ సైతం బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిధ్దపడుతుండటం ప్రస్తుతం ఆసక్తి రేపే అంశంగా మారింది.  

అఖిలేష్‌ అడ్డా నుంచే ఆశిమ్‌ పోటీ...
1994 బ్యాచ్‌కు చెందిన 51 ఏళ్ల ఆశిమ్‌ అరుణ్‌ పదిరోజుల కిందటే స్వచ్చంద పదవీ విరమణ ప్రకటించారు. 2017 ఎన్నికల్లో గెలిచిన అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనా«థ్‌ ఆశిమ్‌ను కాన్పూర్‌ మొదటి పోలీస్‌ కమిషనర్‌గా నియమించారు. ఇక్కడ రౌడీ మూకల ఆట పట్టించి ఆశిమ్‌ తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. అంతకుముందు ఆశిమ్‌ అలీఘర్, గోరఖ్‌పూర్, ఆగ్రా వంటి జిల్లాల్లో పోలీసు బలగాలకు నాయకత్వం వహించడమే కాకుండా, ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌కు నేతృత్వం వహించారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన దళిత ఉపకులం ‘జాతవ్‌’ వర్గానికి చెందిన ఆశిమ్‌ అరుణ్‌ యూపీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజే వీఆర్‌ఎస్‌ ప్రకటించి ఈ నెల 16న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం కన్నౌజ్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ గతంలో ఎంపీగా గెలిచారు.

ఇక్కడి నుంచే ఆశిమ్‌ అరుణ్‌ పోటీ చేస్తుండటంతో అప్పుడే ఆయన చేరికపై అఖిలేష్‌ ఘాటుగా స్పందించారు. ‘ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ఆశిమ్‌ అరుణ్‌ సహాయపడుతున్నారని నేను ఆరోపించాను. బీజేపీలో చేరికతో అది నిజమైంది’ అని విమర్శలు గుప్పించారు. ఇక ఆశిమ్‌ అరుణ్‌తో పాటే మాజీ ఐఏఎస్‌ అధికారి రామ్‌ బహదూర్‌ సైతం ఆదివారం బీజేపీలో చేరారు. 2017కు ముందే బీఎస్పీలో చేరి మోహన్‌లాల్‌గంజ్‌ నుంచి పోటీ చేసి ఓడిన రామ్‌ బహదూర్‌ ప్రస్తుతం అదే స్థానం నుంచి బీజేపీ టిక్కెట్‌ ఆశిస్తున్నారు.  

బ్రిజ్‌లాల్‌ స్ఫూర్తితో..
యూపీ మాజీ డీజీపీ బ్రిజ్‌లాల్‌ స్ఫూర్తితోనే ఆశిమ్‌ అరుణ్‌ బీజేపీలో చేరారని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్‌ అయిన బ్రిజ్‌లాల్‌లో 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. పాసీ దళితుడైన బ్రిజ్‌లాల్‌ 2010–12లో బీఎస్పీ అధినేత్రి మాయావతి హయాంలో యూపీ డీజీపీగా పనిచేసిన సమయంలో ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌‘గా పేరు గడించారు. బీజేపీలో చేరాక ఆయన్ను రాజ్యసభకు పంపడంతో పాటు యూపీలో నేరస్థులు, మాఫియాల అణిచివేతలో ఆయన సహాయాన్ని యోగి ప్రభుత్వం తీసుకుంటోంది.

ఇక 1988 బ్యాచ్‌కు చెందిన గుజరాత్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.కే. శర్మ గత ఏడాది బీజేపీలో చేరేందుకు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా పనిచేసిన సమయంలో, ఆ తర్వాత ప్రధాని అయ్యాక ఆయన కార్యాలయంలో పని చేసిన ఏ.కే. శర్మ, వీఆర్‌ఎస్‌ తీసుకున్నాక బీజేపీ ఆయన్ను శాసనమండలికి పంపింది. గత ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మోదీ ఆశీస్సులతో యోగి కేబినెట్‌లో చేరతారనే అంతా భావించారు.

కానీ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా ఎదుగుతారనే భయంతో ఏకే శర్మను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి యోగి సుముఖత చూపలేదు. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన శర్మ... మోదీ నియోజకవర్గం వారణాసితో పాటు తూర్పు యూపీలో క్రియాశీలంగా వ్యహరిస్తున్నారు. ఇక 2014 ఎన్నికల సంందర్భంగా మరో ఐపీఎస్‌ అధికారి, ముంబాయి పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సత్యపాల్‌సింగ్‌ను యూపీలోని భాగ్‌పట్‌ నుంచి పార్లమెంట్‌కు పోటీ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్‌సింగ్‌ను ఓడించి వార్తల్లో నిలిచారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఆయన అజిత్‌సింగ్‌ కుమారుడు జయంత్‌ చౌదరీని ఓడించారు.  

గతంలోనూ అనేకమంది...
యూపీలో బ్యూరోక్రాట్‌ల నుంచి పొలిటీషియన్‌లుగా మారిన వారి లిస్టు పెద్దదిగానే ఉంది. మాజీ ఐఏఎస్‌ అధికారులు  కున్వర్‌ ఫతే బహదూర్, పన్నా లాల్‌ పునియా, అహ్మద్‌ హసన్, శిరీష్‌ చంద్ర దీక్షిత్, దేవేంద్ర బహదూర్‌ రాయ్, దేవి దయాల్, ఐసీఎస్‌ అధికారులు మహేంద్ర సింగ్‌ యాదవ్, బీపీ సింఘాల్‌ తదితరులు ఉన్నారు. వీరిలో చాలామంది ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల్లో రాష్ట్ర మంత్రులగానూ పనిచేశారు.  
– సాక్షి, న్యూఢిల్లీ

>
మరిన్ని వార్తలు