కులాల లెక్కన...‘ఆకర్ష్‌’ మంత్రం

13 Jan, 2022 06:15 IST|Sakshi

ప్రధాన వర్గాలను ప్రభావితం చేయగల జనాకర్షక నేతలకు గాలమేస్తున్న పార్టీలు

యూపీలో స్వామి ప్రసాద్‌ రాకతో ఎస్పీకి పెరగనున్న ఓబీసీ బలం

బ్రాహ్మణ, రాజ్‌పుత్, ఎస్సీ వర్గాల నేతలకు కాషాయ కండువా కప్పిన బీజేపీ

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రస్తుతం కులాలు, వర్గాల వారీగా ఓట్లను రాబట్టగల నేతలను ఆకర్షించడంపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రధాన కులాలను ప్రభావితం చేయగల సమర్ధులైన కీలక నేతలపై ఆకర్ష్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న అన్ని ప్రధాన పార్టీలు, వారిని చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా యూపీలో అధికారాన్ని కాపాడుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే ఫిరాయింపుదారులకు రెడ్‌కార్పెట్‌ వేయగా, ఎన్నికల షెడ్యూల్‌ అనంతరం సమాజ్‌వాదీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీ వ్యూహాన్ని చిత్తుచేసే పనిలో పడింది. మంత్రులు స్వామి ప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌లు రాజీనామా చేసి బీజేపీని వీడటం, వారి బాటలోనే బీజేపీకి మరో నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో వలసల పర్వం హీటెక్కుతోంది.  

ముందే చేరికలను తెరతీసిన బీజేపీ
గడిచిన ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 312 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ప్రస్తుత ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల కన్నా ముందుగానే మేల్కొన్న పార్టీ అధిష్టానం గత ఏడాది నవంబర్‌ నుంచే ప్రభావవంతమైన నేతలను ఆకట్టుకునే యత్నాలు ఆరంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచనల మేరకు లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యేల కాళీచరణ్, మహారాజ సుహేల్‌దేవ్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు బాబన్‌ రాజ్‌భర్‌ను పార్టీలో చేర్చుకుంది. 2.4 శాతంగా ఉన్న రాజ్‌భర్‌లు గతంలో బీజేపీతోనే ఉన్నా సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో వీరి ఓట్ల అటువైపుకు వెళ్లకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంది.

ఇక బ్రాహ్మణ వర్గాలు ఏమాత్రం చేజారిపోకుండా కాంగ్రెస్‌కు చెందిన మాజీ హోంమంత్రి, ప్రయోగ్‌రాజ్‌ నుంచి మూడుస్లార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేంద్ర త్రిపాఠితో పాటు మరో మాజీ మంత్రి జై నారాయణ్‌ తివారీ, మరో కీలక నేత విజయ్‌ మిశ్రాలను పార్టీ కండువా కప్పింది. బీఎస్పీ నుంచి ఎస్పీకి దళిత ఓటు బ్యాంకు వెళ్లకుండా ఎస్సాలోని ప్రముఖ దళిత నేత సుభాస్‌ ఫసికి కాషాయ కండువా కప్పింది. ఎస్పీని బలహీనపర్చే యత్నంలో గత నవంబర్‌లో పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రవిశంకర్‌సింగ్, నరేంద్రసింగ్‌ భాటి, సీపీచాంద్, రామ్‌ నిరంజన్‌లను పార్టీలోకి లాగేసింది. వీరంతా ఠాకూర్‌ వర్గానికి చెందిన వారే. తాజాగా స్వామి ప్రసాద్‌ మౌర్య రాజీనామా నేపథ్యంలో మేల్కొన్న బీజేపీ బుధవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నరేష్‌ సైనీ, ఎస్పీ ఎమ్మెల్యే హరిఓంలను పార్టీలో చేర్చుకుంది. æ

ఆటలో వేడి పెంచిన ఎస్పీ
చేరికలపై బీజేపీ కమిటీ ఏర్పాటు చేసిన మరుక్షణమే వారికి షాక్‌ ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్‌లోనే ఆరుగురు బీఎస్పీ, ఒక బీజేపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో ఆట మొదలు పెట్టిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌.. ప్రస్తుతం మంత్రులు స్వామి ప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌ల రాజీనామాతో వేడి పెంచారు. స్వామి ప్రసాద్‌ సహా ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేలు 14న ఎస్పీలో చేరే అవకాశం ఉంది. ఓబీసీ వర్గాల్లో స్వామి ప్రసాద్‌కు గట్టు పట్టు ఉండగా, మిగతా ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే వారే. వీరితో పాటు మరో 13 నుంచి 17 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా ఓబీసీ, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, ముస్లిం వర్గాల్లో గట్టి పట్టున్న ఇమ్రాన్‌ మసూద్‌ను ఎస్పీ చేర్చుకోగా, ఆయనతో పాటే ఇద్దరు ఎమ్మెల్యేలు నరేశ్‌ సైనీ,  మసూద్‌ అక్తర్‌లో ఎస్పీలో చేరారు. 19 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు చీలకుండా ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీలలో మైనారిటీ నేతలందరినీ పార్టీలో చేర్చుకునేలా అఖిలేశ్‌ వ్యూహ రచన చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు