యోగితో యూపీలో అభివృద్ధి!

7 Feb, 2022 04:11 IST|Sakshi

ఆదిత్యనాథ్‌ పాలనపై ప్రధాని ప్రశంసలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైతే, కోవిడ్‌ సంక్షోభ సమయంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొద్ది రోజుల్లోనే భర్తీ చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూపీ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఆయన డిజిటల్‌ ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చకు  తెరదించుతూ యోగిని ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా రాకపోయి ఉంటే యోగి సారథ్యంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధిని సాధించి ఉండేదని అన్నారు.

కేంద్ర పథకం కింద నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యోగి ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఇస్తేనే, ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలకు చేయడానికి వీలు కలుగుతుందని చెప్పారు.  ఆగ్రా, మథుర, బులంద్‌షార్‌ ఓటర్లనుద్దేశించి ప్రధాని ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడారు. ఈ సారి ఎన్నికల్లో అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు. యూపీలో బీజేపీ మళ్లీ గెలిస్తే సీఎం అభ్యర్థిని మారుస్తుందా అన్న సందేహాలకు తావు లేకుండా ప్రధాని ప్రసంగం సాగింది. 

రాష్ట్రంలో మహిళలంతా బీజేపీ మళ్లీ గెలవాలని, యోగి మళ్లీ సీఎం కావాలని నిర్ణయించుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల అవసరాలను గుర్తించలేదని దుమ్మెత్తి పోశారు. యూపీని లూటీ చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వారి కుటుంబమే ప్రభుత్వంగా మారితే, బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రమంతా ఒక కుటుంబంలా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు.  

బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా
భారత గానకోకిల లతా మంగేష్కర్‌ కన్నుమూయడంతో యూపీలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ హాజరయ్యే ఒక కార్యక్రమంలో  ఆదివారం ఉదయం 10:15 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది. లత మరణంతో రెండు నిముషాల సేపు  నేతలు మౌనం పాటించారు. మేనిఫెస్టో విడుదల కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని స్వతంత్ర దేవ్‌ సింగ్‌ చెప్పారు.

బీజేపీ నేతల ప్రవేశంపై నిషేధం
తమ గ్రామంలోకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావొద్దంటూ బోర్డు ఏర్పాటు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లా గున్నౌర్‌ పరిధిలోని బిచ్‌పురి సైలాబ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. బీజేపీ శ్రేణుల రాకను గ్రామస్థులు అడ్డుకుంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బోర్డు ఏర్పాటు చేసిన గ్రామపెద్ద నిరంజన్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకు నిరసనగానే ఈ బోర్డు పెట్టినట్లు ప్రజలు చెబుతున్నారు.

యూపీలో మామపై కోడలి పోటీ!
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం షాజహాన్‌పూర్‌ జిల్లాలోని తిల్హార్‌ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రోషన్‌లాల్‌ వర్మపై ఆయన కోడలు సరితా యాదవ్‌ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రీయ సమాజ్‌ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తానని ఆమె చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన వర్మ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సమాజ్‌వాదీ పార్టీ ఆయనకు తిల్హార్‌ టిక్కెట్‌ ఇస్తామని ప్రకటించింది. తన మామ రోషన్‌లాల్‌ వర్మ భూకబ్జాదారుడు అని సరితా యాదవ్‌ ఆరోపించారు. అసలు సరితా యాదవ్‌ తన కోడలే కాదని వర్మ చెబుతున్నారు.

రాయ్‌బరేలీ స్టార్‌ ప్రచారకుల్లో లేని సోనియా
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నాలుగో దశలో ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, రాయ్‌బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ స్టార్‌ ప్రచారకుల జాబితాలో సోనియా పేరు లేకపోవడం గమనార్హం. 30 మంది స్టార్‌ ప్రచారకుల జాబితాలో రాహుల్‌ గాంధీ, గులాం నబీ ఆజాద్, ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు ఉన్నారు.

పంజాబ్‌లో అన్నదమ్ముల పరస్పర పోటీ
పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌ జిల్లాలో ఉన్న మజిథా అసెంబ్లీ స్థానం నుంచి అన్నదమ్ములు వేర్వేరు పార్టీల టిక్కెట్లపై పోటీకి దిగుతున్నారు. తనదే గెలుపు అంటూ ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుఖ్‌జిందర్‌రాజ్‌ సింగ్‌ అలియాస్‌ లల్లీ మజీథియా ఆమ్‌ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై, ఆయన తమ్ముడు జగ్విందర్‌పాల్‌ సింగ్‌ అలియాస్‌ జగ్గా మజీథియా కాంగ్రెస్‌ టిక్కెట్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు