టైమ్‌ చూసి... హ్యాండిస్తున్నారు..!

30 Jan, 2022 05:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోలింగ్‌ తేదీకి గడువు దగ్గరకొస్తున్న కొద్దీ, కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని మరింత బలహీన పరిచేలా ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మినహా మిగతా హస్తిన నేతలు ఎవరూ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెప్పేస్తున్నారు. పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించే చర్యలు ఏవీలేకపోవడం, పార్టీలో ప్రాధాన్యంపై ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం, పార్టీ గెలిచే అవకాశాలపై నమ్మకంలేకపోవడంతో పార్టీ విధేయులే ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు.  

2019 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యూపీ ఇంఛార్జ్‌గా ప్రియాంకా గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, పార్టీ పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని భావించినా, ఇప్పటికే 20 మందికి పైగా కీలక నేతలు పార్టీని వీడడం తలనొప్పి వ్యవహారంలా మారింది.  కేంద్ర మాజీ మంత్రి,  పార్టీ అధిష్టానానికి సన్నిహితుడైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్‌ ప్రసాదతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీని వీడగా, షెడ్యూల్‌ విడుదలయ్యాక పశ్చిమ యూపీలో కీలక ముస్లిం నేత, గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ఇమ్రాన్‌ మసూద్‌ ఎస్పీలో చేరారు. తాజాగా స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా ప్రకటించిన మరుసటిరోజే మాజీ కేంద్రమంత్రి ఆర్పీఎన్‌ సింగ్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల సమయంలో పేరున్న నేతలే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ పార్టీని వదిలివెళ్లేవారిని ఆపలేకపోవడం పార్టీ అవకాశాలను దెబ్బతీస్తోంది. కాంగ్రెస్‌ను వీడిన కొందరు కీలక నేతలు వీరు..

మరిన్ని వార్తలు