Lakhimpur Kheri Incident: రైతులపై దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్‌

5 Oct, 2021 12:54 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరి జిల్లాలో నిరసనలో పాల్గొన్న రైతుల మీదకు ఎస్‌యూవీ కారు దూసుకెళ్లిన దృశ్యాలు తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిని అధికార బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ సైతం తన ట్విటర్‌లో షేర్‌ చేయడం గమనార్హం. ఉద్ధేశ్యపూర్వకంగా రైతులను కారుతో తొక్కించిన వీడియో చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుందని, కారులో కూర్చున్న వారితోపాటు ఈ ఘటనకు కారకులైన వారందరిని వెంటనే అరెస్టు చేయాలని సూచించారు.
చదfవండి: చీపురుపట్టిన ప్రియాంకా గాంధీ వాద్రా

25 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఓ వాహనం పూర్తిగా రైతుల మీ నుంచి దూసుకెళ్లింది. దీంతో కొందరు రైతులు కిందపడిపోగా.. మరికొంత మంది కారు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో వెనక మరో వాహనం సైరెన్లతో వెళ్లింది. అయితే కారు అక‌స్మాత్తుగా వ‌చ్చి త‌మ‌ను ఢీకొట్టిన‌ట్లు రైతులు చెబుతున్నారు.  
చదవండి: Lakhimpur Kheri Violence: కేంద్రమంత్రి కుమారుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

అయితే ఈ వీడియోను పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే వీడియోలో మంత్రి కొడుకే కారు నడుతుపుతున్నట్లు స్పష్టంగా కనిపించడం లేదు.  ఇక ఇదే వీడియోను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ షేర్‌ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీ ప్రభుత్వం నన్ను నిర్బంధించి 28 గంట‌లు అవుతోంది. కానీ అన్న‌దాత‌ల మీద నుంచి కారును తీసుకెళ్లిన వ్య‌క్తిని ఇప్పటి వరకు అరెస్టు చేయ‌లేదు’ అంటూ మండిపడ్డారు.
చదవండి: లఖీమ్‌పూర్‌ ఖేరిపై.. రాజకీయ ప్రకంపనలు 

కాగా లఖీమ్‌పూర్‌ ఖేరి జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ బన్బీర్‌పూర్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండగా..  వీరి పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. మంత్రి అజయ్‌ మిశ్రా వెంట ఆయన కొడుకు ఆశిష్‌ సైతం కాన్వాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనలో భాగంగా టికోనియా ప్రాతంలో నిరసన  చేస్తున్న సమయంలో వారి వెనుక నుంచి ఓ వాహ‌నం వ‌చ్చి ఢీకొట్టింది. మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం అక్కడి రైతులు మీదుగా దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. 

మంత్రి కాన్వాయ్‌లోని కారు బీభ‌త్సం సృష్టించడంతో  రైతులు భారీ విధ్వంసానికి దిగారు. ఈ ఘటనతో ఆగ్రహంతో ఉన్న రైతులు ఆశిష్‌ వాహనంతోపాటు మూడు కార్లకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. మంత్రి కాన్వాయ్‌లోని కారు రైతుల మీదకు దూసుకెళ్లడంతో హింస చెలరేగిందని, మంత్రి కుమారుడే వాహనాన్ని నడుపుతున్నాడని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు.  

అయితే  తాము ఆ స‌మ‌యంలో అక్క‌డ‌లేమ‌ని కేంద్ర మంత్రి, ఆయ‌న కుమారుడు చెప్పారు. ఇక చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు 45 ల‌క్ష‌ల ప‌రిహారాన్ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. గాయపడిన వారికి రూ. 10 లక్షల పరిహారం అందుతుందని తెలిపింది. ఈ హింసాత్మక ఘటనను ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్ర మంత్రి కుమారుడిపై హత్య కేసు నమోదైంది. రిటైర్డ్ జ‌డ్జితో ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్నారు.
 

మరిన్ని వార్తలు