UP: అమిత్‌ షాతో భేటీ పచ్చి అబద్ధం.. బీజేపీలో చేరేదే లే!

19 Mar, 2022 14:39 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ రాజకీయ సమీకరణాలు మార్చే వార్త ఒకటి గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టడమే కాదు.. ఆరు సీట్లు గెల్చుకుంది సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ SBSP. అయితే Suheldev Bharatiya Samaj Party అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారని, తిరిగి బీజేపీ భాగస్వామిగా చేరబోతున్నారంటూ కథనాలు వస్తుండడం ఊహాగానాలకు తెర తీసింది.
 
సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌, అమిత్‌ షాతో భేటీ అయిన యూపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. షాతో పాటు పలువురు బీజేపీ నేతలతో హస్తినలో ప్రకాశ్‌.. వరుస భేటీలు జరిగినట్లు శుక్రవారం కథనాలు వెలువడ్డాయి.  ఈ భేటీకి సంబంధించిన ఫొటోలంటూ కొన్ని వైరల్‌  అయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ రాజ్‌భర్‌ తీవ్రంగా స్పందించారు. 


‘‘అమిత్‌ షాను కలిసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అది పుకారు మాత్రమే. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఫొటోలు పాతవి. పాత ఫొటోలను పోస్ట్‌ చేసి.. వాళ్లకు ఇష్టమొచ్చినట్లు పుకార్లు పుట్టించేస్తు‍న్నారు. ఎస్పీతోనే మా పొత్తు కొనసాగుతుంది. ఈ నెల 28న సంయుక్త కార్యచరణ కోసం భేటీ కాబోతున్నాం. స్థానిక ఎన్నికల్లోనూ ఎస్పీతో కలిసే పోటీ చేస్తాం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మా పొత్తు కొనసాగుతుంది’’ అని ప్రకటించారాయన. 


ఇక ఈ పుకార్లను ఎస్బీఎస్‌పీ జాతీయ కార్యదర్శి అరవింద్‌ రాజ్‌భర్‌ కూడా ఖండించారు. ‘‘బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నామనే వార్తలో నిజం లేదు. ఎస్పీతోనే మేం ఉంటాం. మరోవైపు పార్టీ ప్రతినిధి పీయూష్‌ మిశ్రా కూడా పుకార్లను ఖండిస్తూ ట్వీట్‌ చేశారు. 


ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ నేతృత్వంలోని ఎస్బీఎస్పీ SBSP గతంలో బీజేపీతో పొత్తు కొనసాగించింది. 2017 యోగి ఆదిత్యానాథ్‌ అధికారంలోకి వచ్చాక.. కేబినెట్‌లో రాజ్‌భర్‌ కూడా చేరారు. అయితే.. వెనుకబడిన వర్గాలను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ రెండేళ్ల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేసి కూటమి నుంచి బయటకు వచ్చేశారు.

మరిన్ని వార్తలు