బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్‌ అవుతారా?

31 Jan, 2022 13:12 IST|Sakshi

ఉత్తరాఖండ్‌కు అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి. ఆరెస్సెస్‌తో 30 ఏళ్ల అనుబంధం, కరడుగట్టిన హిందుత్వ వాదం,  ఇరుగు పొరుగు దేశాలను కూడా కలిపేసుకొని మళ్లీ అఖండ భారత్‌ ఏర్పాటు కావాలన్న లక్ష్యం,  బీజేపీ సీనియర్‌ నాయకుల అండదండలు అన్నీ కలిపి ధామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. యువకుడు కావడంతో సీఎం అయ్యాక ఎన్నో సృజనాత్మక ఆలోచనలతో పరిపాలన సాగించారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోయినా, గత సీఎంల వల్ల ఏర్పడిన వివాదాలను పరిష్కరించారు. రేయింబవళ్లు కష్టపడే తత్వం ఉన్న ధామి బీజేపీని వరుసగా రెండోసారి గెలిపించాలన్న సవాల్‌ స్వీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఏకంగా 57 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.  ఏడాదిలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారన్న అపప్రదను పోగొట్టుకోవాలంటే  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో పాటు, ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి యువ ఆలోచనలు కూడా కలిసొస్తాయన్న విశ్లేషణలున్నాయి.  

► ఉత్తరాఖండ్‌లోనిపితోరగఢ్‌లో 1975 సంవత్సరం సెప్టెంబర్‌ 16న జన్మించారు.

► లక్నో యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు.

► యువకుడిగా ఉండగానే ఆరెస్సెస్‌ భావజాలంవైపు ఆకర్షితులయ్యారు. 1989–1999 వరకు పదేళ్ల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) సభ్యునిగా ఉన్నారు. ఆరెస్సెస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.  

► ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా చీఫ్‌గా 2002 నుంచి 2008 వరకు పని చేశారు.

► పుష్కర్‌ సింగ్‌ భార్య గీతా ధామి. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.  

► ఉధామ్‌ నగర్‌లోని ఖతిమా నియోజకవర్గం నుంచి 2012లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి తన స్థానాన్ని కాపాడుకున్నారు.  

► భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 

► ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా 2021 జూలైలో పదవీబాధ్యతలు తీసుకున్నారు. 45 ఏళ్ల వయసులో సీఎం పదవిని చేపట్టి రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన సీఎంగా రికార్డులకెక్కారు.  

► ఉత్తరాఖండ్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కుల, ప్రాంతీయ సమతుల్యతల్ని కాపాడే విధంగా ఠాకూర్‌ సామాజిక వర్గానికి చెందిన ధామిని బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.  (క్లిక్‌: గజ ఈతగాడు.. ఆయనను కాదని ఒక్క అడుగు ముందుకు వేయలేదు..)

► రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు పుష్కర్‌ సింగ్‌ ధామి అత్యంత సన్నిహితులు. రాజ్‌నాథ్‌ సూచనల మేరకే ఆయనను సీఎంను చేసినట్టుగా ప్రచారంలో ఉంది.  

► భగత్‌ సింగ్‌ కొషియారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర  అధికారిగా ప్రత్యేక బాధ్యతలు నిర్వహించారు.  

► సీఎంగా ఎక్కువ కాలం పదవిలో కొనసాగకుండానే ఎన్నికలు రావడంతో ధామి ముందర ఎన్నో సవాళ్లు ఉన్నాయి.  

► కేవలం ఆరు నెలల కాలంలోనే ధామి ప్రభుత్వం 550 నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసింది 

► సీఎం పదవి చేపట్టిన నాటికే సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ధామి చాలా ప్రయత్నాలు చేశారు. దేవస్థానంలో బోర్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న పూజార్లను వెనక్కి తీసుకునేలా చేయడంలో కృతకృత్యులయ్యారు.  

► అయిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చిందన్న విమర్శల్ని పోగొట్టేలా చర్యలు తీసుకున్నారు. యువకుడు కావడంతో కొత్త ఆలోచనలతో అందరినీ ఆకర్షించారు. కష్టపడే మనస్తత్వంతో  బీజేపీకి ధామి ప్లస్‌ పాయింట్‌ అవుతారనే అంచనాలైతే ఉన్నాయి.  
 – నేషనల్‌ డెస్క్, సాక్షి 

అఖండ భారతం
ధామి ఉత్తరాఖండ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో 2015లో ఆయన చేసిన పాత ట్వీట్‌ వివాదాస్పదమై వెలుగులోకి వచ్చింది. ఆ ట్వీట్‌లో అఖండ భారత్‌ స్థాపనే తన లక్ష్యమంటూ మన ఇరుగు పొరుగు దేశాలను భారత్‌లో అంతర్భాగంగా చూపిస్తూ కాషాయం రంగు పూసిన మ్యాప్‌ని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. దేశభక్తి ఉన్న ప్రతీఒక్కరూ అఖండ భారత్‌ కోరుకుంటారంటూ ఆయన కామెంట్‌ చేయడంపై కలకలం రేగింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొంతమంది ఆ ట్వీట్‌ని పొగుడుతూ ఆయనని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, దేశానికి విదేశాంగ మంత్రిని చేయాలంటూ కొందరు బ్రహ్మరథం పడితే, మరికొందరు విమర్శించారు. (చదవండి: నాన్నా..‘ఎస్‌ వికెన్‌ డూ ఇట్‌’!)

మరిన్ని వార్తలు