ఓటింగ్ వేళ. కోడ్​ ఉల్లంఘించిన సీఎం! ఆయన భార్య ఏమన్నారంటే..

14 Feb, 2022 15:26 IST|Sakshi

పోలింగ్​ సమయంలో ఎన్నికల కోడ్​ ఉల్లంఘన ఘటనలు తెరపైకి వచ్చే సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ఇప్పుడు ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆయన భార్య వెనకేసుకొచ్చిన తీరుపై సోషల్​ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి ఎన్నికల కోడ్​ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి తన నియోజకవర్గం ఖతిమాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వేయడానికి వెళ్లిన టైంలో.. బీజేపీ కాషాయపు కండువాలు మెడలో ధరించి ఉన్నారు. అంతేకాదు దుస్తులపై కమలం గుర్తులు కూడా ఉన్నాయి. అనంతరం ఓటు వేశాక.. వాళ్లు గుర్తులను ప్రదర్శించడం ద్వారా ప్రచారం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

భారత ఎన్నికల కమిషన్​ నియమావళి ప్రకారం.. మాన్యువల్​  పోస్టర్లు, జెండాలు, చిహ్నాలు, మరేదైనా ప్రచార సామగ్రిని పోలింగ్ బూత్‌ల దగ్గర ప్రదర్శించకూడదు. కానీ, పుష్కర్​, ఆయన భార్య పార్టీ కండువాలు, గుర్తులు ధరించడమే కాదూ.. కార్యకర్తలతో పోలింగ్​ టైంలోనూ ప్రచారం నిర్వహించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఆరోపణలపై పుష్కర్​ భార్య గీతను ఓ జాతీయ మీడియా ప్రశ్నించగా..

‘ఇది ప్రచారం అని ఎవరన్నారు?. ప్రతీ ఎన్నికల్లోలాగే.. ఈసారి ఎంత ఓటింగ్​ నమోదు అవుతుందో చూడడానికే వచ్చాం. ప్రతీ పార్టీకి చెందిన వాళ్లూ ఇలా పార్టీ సింబల్స్​ను ధరించే ఉన్నారు. అయినా ప్రజలు ఆల్రెడీ ఓటేయడానికి సిద్ధమై వస్తారు. ఇలాంటివి వాళ్లను ఎందుకు ప్రభావితం చేస్తాయి? అని బదులిచ్చారు ఆమె. మరోవైపు ఆ సమయంలో బీజేపీ హడావిడి తప్ప అక్కడేం కనిపించలేదు. అయినా పోలింగ్​ సిబ్బంది, ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీసులు వాళ్లను అడ్డుకోలేదన్న పలువురు ఓట్లర్లు చెప్పడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. మరోవైపు ఎన్నికల ప్రచారం పేరిట డబ్బులు పంచారంటూ ఆప్​ ఏకంగా ఉత్తరాఖండ్​ సీఎంపైనే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉత్తరాఖండ్​ ఆప్​ యూనిట్​ ట్విటర్​లో ఓ వీడియోను సైతం పోస్ట్​ చేయగా...ఈసీ చర్యలేవంటూ? పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారు. 

మరిన్ని వార్తలు