VK Sasikala: అమ్మపార్టీలో మళ్లీ శశి‘కలకలం’

17 Oct, 2021 07:34 IST|Sakshi
జయ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న శశికళ

నాడు శపథం..మరి నేడో?

అమ్మ సమాధి వద్ద చిన్నమ్మ 

స్వర్ణోత్సవ వేళ అన్నాడీఎంకేలో కలకలం 

సాక్షి ప్రతినిధి,చెన్నై: అమ్మపార్టీలో మళ్లీ శశి‘కలకలం’ ప్రారంభమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షపడిన తరువాత జైలుకెళుతూ జయ సమాధి వద్ద చిన్నమ్మ శశికళ శపథం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగున్నరేళ్ల తరువాత శనివారం మళ్లీ అమ్మ సమాధి వద్ద నివాళులర్పించిన చిన్నమ్మ.. ఈసారి మౌనం పాటిస్తూ మళ్లీ శపథం చేశారా? అవును, నాటి శపథానికి ఇది కొనసాగింపు అంటున్నారు.. కొందరు రాజకీయ విశ్లేషకులు.  

ఇదీ నేపథ్యం.. 
బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఈ ఏడాది జనవరి 27వ తేదీన శశికళ విడుదలయ్యారు. ఫిబ్రవరి 8వ తేదీన బెంగళూరు నుంచి చెన్నై వరకు రోడ్డు మార్గంలో ఆమె వచ్చినపుడు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే ఆమె ఆశించినట్లుగా అన్నాడీఎంకే అగ్రనేతలు ఎవ్వరూ దరి చేరకపోవడంతో నిరాశచెందారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించి ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందడంతో రాజకీయాలపై మరలా దృష్టి సారించడం ప్రారంభించారు. 

చదవండి: (జయలలితకు నెచ్చెలి నివాళి)

కారుకు పార్టీ జెండా కట్టుకుని..
ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే స్వర్ణోత్సోవాల సిద్ధమైన తరుణంలో శనివారం ఉదయం 10.30 గంటలకు చెన్నై టీ నగర్‌లోని వదిన ఇళవరసి ఇంటి నుంచి అమ్మ సమాధికి బయలుదేరారు. కారుకు అన్నాడీఎంకే పతాకాన్ని అమర్చుకోవడం, ఆమెను అనుసరించిన కార్యకర్తలు సైతం అదే పతాకాన్ని చేతబూని అనుసరించడం చర్చనీయాంశమైంది. 11.30 గంటలకు ఎంజీ రామచంద్రన్, జయ సమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. జయ సమాధి వద్ద పది నిమిషాలు మౌనం పాటించి కన్నీళ్లు కార్చారు. గత కొన్నేళ్లు మోస్తున్న గుండెలోని భారాన్ని ఈరోజు దించుకున్నానని మీడియా వద్ద ఆమె అన్నారు. దీంతో ఆమె మాటల్లోని అంతరార్థం ఏమిటని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జైలు కెళ్లేముందు జయ సమాధిపై అరచేత్తో మూడుసార్లు గట్టిగా చరిచి పెదాలు కొరుకుతూ ఏదో శపథం చేస్తున్నట్లుగా ఆమె వ్యవహరించారు.

జైలు నుంచి విడుదల కాగానే, ఆ తరువాత అనేక సందర్భాల్లో జయ సమాధి వద్దకు వెళ్లాలని శశికళ ప్రయత్నించినా వెళ్లలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అన్నాడీఎంకే చతికిలబడగా డీఎంకే ప్రభుత్వం దూసుకెళుతున్న పరిస్థితుల్లో అమ్మ పార్టీకి తానే దిక్కనే సంకేతాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో జయ సమాధి వద్దకు శశికళ రాక కలకలం రేపింది. ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నై టీనగర్‌ లోని ఎంజీఆర్‌ స్మారక నిలయానికి, అక్కడి నుంచి చెన్నై రామాపురంలోని ఎంజీఆర్‌ నివాసానికి ఆమె వెళతారని సమాచారం. ఆదివారం ఆమె కార్యక్రమా లు అంతవరకే పరిమితమా లేక ఏదైనా దూకుడు ప్రదర్శిస్తారా అనే అనుమానాలు అన్నాడీఎంకే శ్రేణుల్లో నెలకొన్నాయి. 

అన్నాడీఎంకే కార్యాలయం వద్ద హడావుడి  
పార్టీని కైవసం చేసుకోవడంలో భాగంగా అమ్మ సమాధి నుంచి శశికళ నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో చెన్నై రాయపేటలోని పార్టీ మెయిన్‌ గేటు ప్రవేశద్వారం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉదయం 10 గంటలకే మాజీ మంత్రులు, అగ్రనేతలు, జిల్లాల కార్యదర్శులు కుర్చీలు వేసుకుని అడ్డుగా కూర్చున్నారు. అమ్మ సమాధి నుంచి శశికళ ఇంటికి చేరుకున్నారనే సమాచారం అందిన తరువాత మధ్యాహ్నం అందరూ వెళ్లిపోయారు. 

చిన్నమ్మ ఆస్కార్‌కు అర్హురాలు : మాజీ మంత్రి జయకుమార్‌ 
చిన్నమ్మ శశికళ ఒక మహానటి..ఆస్కార్‌ అవార్డుకు ఆమె అర్హురాలని మాజీ మంత్రి జయకుమార్‌ ఎద్దేవా చేశారు. చెన్నై మెరీనాబీచ్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద శశికళ కన్నీ రు కార్చడంపై మీడియాతో ఆయన మాట్లాడారు. అంతా ఒక నాటకమని వ్యాఖ్యానించారు. జయ సమాధిని రోజూ లక్షలాది మంది సందర్శిస్తుంటా రు, శశికళ రాక కూడా అందులో భాగమేనని.. అంతకంటే ప్రత్యేకత ఏమీ లేదని ఆయన అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉందని, దాన్ని తన చేతుల్లోకి తీసుకుని నడిపిస్తానంటూ.. శశికళ అనడం అవివేకమన్నారు. అన్నాడీఎంకే అనేది ఒక గజరాజు, దానిపై ఒక దోమ కూర్చుని ఆ గజరాజును నేనే నడిపిస్తున్నానని భావించినట్లు శశికళ కూడా ప్రగల్భాలకు పోతున్నారని దుయ్యబట్టారు. 

నేడు 50 ఏళ్ల వేడుకలు
అన్నాదురై శిష్యునిగా డీఎంకేలో కొనసాగిన ఎంజీ రామచంద్రన్‌ తన గురువు మరణం తరు వాత డీఎంకేలో ఇమడలేక పోయారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధితో విభేదించి 1972 అక్టోబర్‌ 17వ తేదీన అన్నాడీఎంకేను స్థాపించారు. రాజకీయాల్లో అప్రతిహతంగా సాగిన అన్నాడీఎంకే 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాయి.    

మరిన్ని వార్తలు