Atal Bihari Vajpayee: ఓటమి, ఆపై అనారోగ్యం.. వీల్‌చైర్‌లోనే వాజ్‌పేయి

16 Aug, 2021 13:31 IST|Sakshi

VAJPAYEE DEATH ANNIVERSARY: భారత రాజకీయాలకు ‘భీష్మ పితామహుడి’గా తనకంటూ ఒక చెరగని ఒక ముద్ర వేసుకున్నాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడిగా, రాజకీయాల్లో అజాత శత్రువనే గుర్తింపు దక్కింది ఆయనకు. సాహితి లోకానికి కవిగా,  దాదాపు ఆరేళ్లపాటు భారత దేశానికి ప్రధానిగా, బీజేపీకి ముఖ్యనేతగా సేవలందించిన ఆయన..  2004 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ప్రజల ముందుకు వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. 

ఇవాళ భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి మూడో వర‍్ధంతి. 2018, ఆగస్ట్‌ 16న తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

2004 ఓటమి తర్వాత వాజ్‌పేయి.. పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా, బీజేపీ కీలక సమావేశాల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. అయితే 2005 డిసెంబర్‌లో పుట్టినరోజు దగ్గరపడుతుండగా.. రాజకీయాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించి, అభిమానులకు, కార్యకర్తలకు పెద్ద షాక్‌ ఇచ్చారు ఆయన. ఇక ఎన్నికల బరిలోకి దిగనప్పటికీ.. పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తానని పార్టీ సారధ్య బాధత్యల నుంచి తప్పుకున్నాడాయన.ఆపై అనారోగ్యంతో ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు.
 

చివరి సభ.. 
ఫిబ్రవరి 11, 2007.. పంజాబ్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశం. బీజేపీ టికెట్‌తో అమృత్‌సర్‌ నుంచి లోక్‌ సభ స్థానానికి పోటీకి దిగాడు. ఆ ప్రచార సభకు ప్రధాన ఆకర్షణ ఎవరో కాదు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి. చాలా గ్యాప్‌ తర్వాత ఆయన ఓ బహిరంగ సభకు వస్తుండడంతో వేలమంది ఆ సభకు హాజరయ్యారు. టెంట్ల కింద జనం కిక్కిరిసి పోవడంతో.. బయట ఉండేందుకు వీలుగా సుమారు 10 వేల మందికి గొడుల్ని అందేసింది బీజేపీ కమిటీ. కుర్చీలోనే కవితతో మొదలుపెట్టిన ఆయన ఉపన్యాసాన్ని .. ఎలాంటి కోలాహలం లేకుండా ఆసక్తిగా తిలకించారు ఆ జనం. ఆ రాజకీయ ఉద్దండుడి చివరి సభ అదేనని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.
 

మీడియా ప్రతినిధులతో..
2007, డిసెంబర్‌ 25న పుట్టినరోజు సందర్భంగా కొందరు జర్నలిస్టులు వాజ్‌పేయిను కలవాలనుకున్నారు. ‘2009లో మరోసారి రాజకీయ పోరాటానికి ఆయన సిద్ధమేనా? ప్రచారంలో అయినా పాల్గొంటారా? లేదంటే ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటారా? అద్వానీకి పగ్గాలు అప్పజెప్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనే ఉద్దేశంతో ఓ జర్నలిస్ట్‌ బృందం అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూశారు. బీజేపీ నేత షానవాజ్‌ హుస్సేన్‌ దగ్గరుండి 10 మంది జర్నలిస్టులను విజయ్‌ మీనన్‌ మార్గ్‌లో ఉన్న వాజ్‌పేయి ఇంటికి తీసుకెళ్లాడు.

అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ కొద్దినిమిషాల మీటింగ్‌ అరేంజ్‌ చేయించాడు హుస్సేన్‌. లోపలికి వెళ్లిన జర్నలిస్టులు.. వాజ్‌పేయి చూడగానే ఆశ్చర్యపోయారు. కుర్చీలో కూర్చుకుని పాలిపోయిన ముఖంతో కదల్లేని స్థితిలో ఉన్నారాయన. చుట్టూ చేరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా ‘నమస్కార్‌’ అనే మాట మాత్రమే వచ్చింది ఆయన నోటి నుంచి. అంతే.. వాజ్‌పేయి పరిస్థితి అర్థం చేసుకుని అంతా బయటకు వచ్చేశారు. 

కుర్చీలోనే భారతరత్న
2009లో ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయి..కాస్త కొలుకున్నాక ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో 2009 ఎన్నికల క్యాంపెయిన్‌కు హాజరు కాలేదు. కానీ, ఆయన పేరు మీద లేఖలు మాత్రం విడుదల చేసింది బీజేపీ. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం అస్సలు సహకరించకపోవడంతో..  కీలక నేతలే అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా ఆయన్ని ఇంటికి వెళ్లి ప్రైవేట్‌గా కలుస్తూ వచ్చారు. 2015లో ఆయనకు భారతరత్న ప్రకటించారు. మార్చి 27, 2015న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ స్వయంగా వాజ్‌పేయి ఇంటికి వెళ్లి మరీ భారత రత్న అందుకున్నారు. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్‌లోనే అందుకోవాలి. కానీ, వాజ్‌పేయి ఆరోగ్య దృష్ట్యా, ప్రైవసీని కాపాడాలన్న ఉద్దేశంతో.. స్వయంగా రాష్ట్రపతే వెళ్లి అందించారు. చివరి రోజుల్లో.. ఆ రాజకీయ ఉద్దండుడు మతిమరుపు, డయాబెటిస్‌, కదల్లేని స్థితిలో కనిపించిన ఫొటోలు చాలామందిని కదిలించివేశాయి. అందుకే ఆయన్ని మీడియా కంటపడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు.

గెలుపు-ఓటమి ఈ రెండింటినీ నవ్వుతూ స్వీకరించే నైజం వాజ్‌పేయిది. 2004లో దారుణ ఓటమి తర్వాత కూడా ‘ఓడిపోయాం.. అంతే’ అంటూ చిరునవ్వు విసిరారు ఆయన. అందుకే అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. అయితే ఆయన పాలనను, ఆదర్శాలను పొగిడే నేతలే తప్పించి.. వాటిని ఆచరించేవాళ్లు ఈరోజుల్లో లేరనే అంటారు రాజకీయ విశ్లేషకులు.

-సాక్షి, వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు