బ్రేకింగ్: బాబు, ఉమపై వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు

19 Jan, 2021 12:51 IST|Sakshi

గొల్లపూడి: తెలుగు వాడి చరిత్ర దేశంలో లిఖించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ఎన్టీ రామరావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వదినను చంపిన ఉమా రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చేయాలని సవాల్‌ విసిరారు. ఎన్నికల ముందు పసుపు.. కుంకుమ ఇస్తే ప్రజలు టీడీపీకి కోసి కారం పెట్టారని తెలిపారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని.. సవాల్ అయినా ప్రతి సవాల్ అయినా మేము సిద్ధమేనని వంశీ ప్రకటించారు.

మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షపై కౌంటర్‌ బదులిచ్చారు. అసంబద్ధమైన ఆరోపణలు చేసి చర్చకు రా అంటే ఎలా అని వంశీ ప్రశ్నించారు. అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చర్చ పెట్టుకుందాం అని చెప్పాము కానీ కొట్లాటకు రమ్మని మేము చెప్పలేదని వంశీ వివరించారు. ఉమా తక్కువ తినలేదు తక్కువ మాట్లాడతాడని మేము అనుకోమని పేర్కొన్నారు. ఒకటి అని రెండు అనిపించుకోవడం ఉమాకి అలవాటు అని తెలిపారు. టీడీపీ చాలా గొప్ప పార్టీ.. ఎన్టీఆర్ టీడీపీ వేరు.. చంద్రబాబు టీడీపీ వేరు అని చెప్పారు.

గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగిందో నాకు తెలుసని.. ఉమా ఒక లోఫర్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మా ఇంట్లో అనేక కులాలు ఉన్నాయి.. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే మేము గెలిచామని పేర్కొన్నారు. ఒక కులాన్ని టార్గెట్ గా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించడం అవాస్తవమని స్పష్టం చేశారు. ఒక కులం వాళ్లు ఓట్లు వేస్తే నేను నాని ఎమ్మెల్యేలుగా గెలవలేదని తెలిపారు. ఉమా ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలని వల్లభనేని వంశీ హితవు పలికారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు