ఆంధ్రా వదిలి.. రూంలో కూర్చుని.. 

19 Aug, 2020 18:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కరోనా వచ్చిన 5 నెలల్లో 4 రోజులు మాత్రమే ఏపీలో ఉన్నారని, రాష్ట్రంలో పనిలేని బాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని వల్లభనేని వంశీ‌ ప్రశ్నించారు. ఆంధ్రా వదిలి రూంలో కూర్చున్న చంద్రబాబు జూమ్‌లో మాట్లాడుతున్నారని, మానసిక భ్రాంతితో తన ఫోన్ ట్యాప్ అయిందంటున్నారని మండిపడ్డారు. బుధవారం వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రమేష్ హాస్పిటల్‌లో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో తప్పేముంది?. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది?. రమేష్ హాస్పిటల్‌కు ఆరోగ్యశ్రీ కింద నగదు చెల్లించినప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచితనం కనపడలేదా ?. ( ‘జగన్‌ మాట ఇచ్చారంటే.. నిలబెట్టుకుంటారు’)

విశాఖ ఎల్‌.జి పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు యాజమాన్యం మీద చర్యలు తీసుకోమని చంద్రబాబు, లోకేష్ లేఖలు రాయలేదా?. తప్పు చేయని రమేష్ పారిపోవాల్సిన అవసరం ఏముంది?. 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో హాస్పిటల్ యాజమాన్యంపై కేసులు పెట్టడం ప్రభుత్వం విధి. రమేష్ హాస్పిటల్ ఏమైనా పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేసిందా?. కోవిడ్ కేర్ సెంటర్‌లు పెట్టి కరోనా లేని వాళ్ల వద్ద కూడా లక్షల రూపాయలు వసూలు చేశారు. తెలంగాణలో కోవిడ్ హాస్పిటళ్లు తప్పు చేస్తే కేసీఆర్‌ చర్యలు తీసుకోలేదా ?. చంద్రబాబు,లోకేష్‌లు జాతీయ పార్టీ వాళ్లుగా తెలంగాణలో ఎందుకు మాట్లాడరు. కమ్మ సామాజిక వర్గాన్ని భ్రష్టు పట్టించేందుకు చంద్రబాబు తయారయ్యాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబు కులం రంగు పూస్తున్నాడు. చట్టం ముందు అందరూ సమానులే’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు