ఆనాడు బాబు మంగమ్మ శపథం చేశారు

18 Jan, 2021 16:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ: గతంలో జరిగిన కార్యక్రమాలకు, ఇప్పుడు జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీకి చాలా వ్యత్యాసం ఉందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన 31 లక్షల మందికి ఇళ్లిస్తున్నారని తెలిపారు. కోర్టు అనుమతి తరువాతే వీటికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ హయాంలో రెండు లక్షల ఇళ్ళకు చంద్రబాబు మంగమ్మ శపథాలు చేశాడని విమర్శించారు. ఇప్పుడేమో ప్రభుత్వం ఇచ్చే పట్టా అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్ళి ఆపారని మండిపడ్డారు. (చదవండి: ‘పేదలకు ఇళ్లు.. ఆయనకొచ్చిన నష్టమేమిటి?’)

మంచి రోజున ఈ ఇళ్ళపట్టాల కార్యక్రమం చేయడం చాలామందికి కడుపునొప్పిగా ఉందని ఎద్దేవా చేశారు. టీడిపీ ఇచ్చిన పట్టాల భూములకు రాయి కూడా కనిపించడం లేదన్నారు. చంద్రబాబు పసుపు, కుంకుమ ఇస్తే ఎన్నికల్లో మహిళలు ఉప్పు కారం పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేవినేని ఉమ ఇంటికి కాంట్రాక్టర్లు తిరుగుతున్నారని, ఆయన తక్కువ ధరలకు భూములు చూపించగలడా? అని ప్రశ్నించారు. వ్యవసాయ భూమి పల్లం కాకపోతే ఇంకెలా ఉంటుంది, బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని ఉమ మీద మండిపడ్డారు. ఇళ్ళపట్టాల పంపిణీని అడ్డుకునే నాయకులను ప్రజలే నిలదీయాలని వంశీ కోరారు. (చదవండి: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఓవరాక్షన్)

మరిన్ని వార్తలు