తగ్గేదే..లే అంటున్న వరుణ్‌: బీజేపీకి షాక్‌, సంచలన వీడియో

14 Oct, 2021 13:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా గళం విప్పిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తగ్గేదే..లే అంటూ  కేంద్రానికి మరోసారి షాకిచ్చారు. మాజీ ప్రధానమంత్రి, బీజేపీ  అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగానికి సంబంధించిన ఒక​ సంచలన వీడియోను తాజాగా పోస్ట్‌ చేశారు. రైతుల అణచివేతకు వ్యతిరేకంగా ఉన్న ఆయన ప్రసంగం క్లిప్‌ను గురువారం ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఒకప్పటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని  విమర్శిస్తూ రైతులకు మద్దతుగా నిలిచిన ఆయన ప్రసంగ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.

చదవండి :  మిశ్రాను పదవి నుంచి తప్పించండి

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతుల సుదీర్ఘ ఉద్యమం, లఖీంపూర్‌ ఖేరిలో రైతులపై హింసాకాండ నేపథ్యంలో బీజేపీ నేత ట్విట్‌ చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. "పెద్ద మనసున్న నాయకుడి నోట తెలివైన మాటలు" అంటూ వరుణ్‌ గాంధీ ట్వీట్ చేశారు.  బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన  సందర్భంలో వాజ్‌పేయి ప్రసంగాన్ని షేర్‌ చేయడమంటే మోదీ సర్కార్‌కు షాకేనని భావిస్తున్నారు. 

వరుణ్‌ గాంధీ షేర్‌ చేసిన వీడియోలో చట్టలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం రైతులను అణచివేయడంపై వాజ్‌పేయి అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "రైతులను భయపెట్టొద్దు. వారు భయపడాల్సిన అవసరం లేదు. మేము రైతుల ఉద్యమాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం లేదు. కానీ అన్నదాతల శాంతియుత ఆందోళనను అణచివేయాలని చూస్తే మాత్రం వారికి అండగా నిలబడటానికి ఏమాత్రం వెనుకాడము" అని వాజ్‌పేయి కేంద్రాన్ని హెచ్చరించడం ఈ క్లిప్పింగ్‌లో చూడొచ్చు.

చదవండి :  Global Handwashing Day 2021: కరోనాకు చెక్‌ పెడదాం

కాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసపై ఘాటుగా స్పందించిన ఏకైక బీజేపీ ఎంపీవరుణ్ గాంధీ.  హత్యలతో వారి నోళ్లు మూయించలేరంటూ ఈ సంఘటన వీడియోను ట్వీట్ చేశారు. అమాయక రైతుల రక్తం చిందిన వైనానికి జావాబుచెప్పాలని, నలుగురు రైతుల మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరుణ్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. కారుతో ఢీకొట్టి మరీ రైతులను హత్య చేశారన్న ఆరోపణల్లో జూనియర్ హోం మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడు. మరోవైపు  కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా మాట్లాడిన నెల రోజులకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడుగా వరుణ్‌ను తొలగించిన సంగతి తెలిసిందే.

చదవండి :  Love Your Eyes: ఆ కళ్లను ప్రేమిస్తున్నారా? అయితే ముందు మీ కళ్లను ప్రేమించండి!

మరిన్ని వార్తలు