వరుణ్‌ గాంధీపై శివసేన ప్రశంసలు.. మీరు కూడా మెచ్చుకోండి!

11 Oct, 2021 19:14 IST|Sakshi

ముంబై: అన్నదాతలకు అండగా నిలిచి సొంత పార్టీ ఆగ్రహానికి గురైన బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీపై శివసేన పార్టీ ప్రశంసలు కురిపించింది. లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనలో రైతులకు దన్నుగా నిలిచిన ఆయనను అభినందించాలని ఉత్తరప్రదేశ్‌ రైతు సంఘాల నేతలకు సూచించింది. ఈ మేర​కు శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. లఖీమ్‌పూర్‌ ఖేరి హింసాకాండలో నలుగురు రైతులతో పాటు 8 మంది ప్రాణాలు కోల్పోయినా బీజేపీ ఎంపీలు స్పందించకపోవడాన్ని శివసేన తప్పుబట్టింది. 

‘శత్రుత్వాన్ని వ్యాప్తి చేయడానికి చేసే ప్రయత్నాలను మన దేశం ఎప్పటికీ సహించదు. వరుణ్ గాంధీ (మాజీ ప్రధాని) ఇందిరా గాంధీ మనవడు, సంజయ్ గాంధీ కుమారుడు. లఖీమ్‌పూర్‌ ఖేరిలో కిరాతక ఘటన చూసిన తర్వాత ఆయన రక్తం మరిగింది. ఈ దారుణోదంతంపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తపరిచారు’ అని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. రాజకీయంగా తనకు ఎదురయ్యే ఆటుపోట్ల గురించి పట్టించుకోకుండా రైతుల హత్యలను ఖండించి ధైర్యంగా నిలబడ్డారని ప్రశంసించింది. ‘వరుణ్ గాంధీని ప్రశంసిస్తూ రైతు నాయకులు తీర్మానం చేయాల’ని శివసేన సలహాయిచ్చింది. 


లఖీమ్‌పూర్‌ ఖేరిలో అన్నదాతలను అత్యంత కిరాతకంగా కారుతో గుద్ది చంపడాన్ని వరుణ్‌ గాంధీ అంతకుముందు తీవ్రంగా ఖండించారు. అధికార మదంతో పేద రైతులను ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘హిందూ వర్సెస్‌ సిక్కు యుద్ధం’గా చిత్రీకరించే కుట్రలు జరుగుతున్నాయని, ఇది చాలా ప్రమాదకర పరిణామమని హెచ్చరించారు. (చదవండి: వరుణ్ గాంధీకి బీజేపీ ఝలక్‌.. ఎందుకంటే..?)


కాగా, అక్టోబర్‌ 3న చోటుచేసుకున్న లఖీమ్‌పూర్‌ ఖేరి దారుణోదంతం కేసులో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు అశిష్‌ మిశ్రా శనివారం పోలీసులు ఎదుట లొంగిపోగా.. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. మరోవైపు అజయ్‌ మిశ్రా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.
చదవండి: ఆ సమయంలో ఆశిష్‌ ఎక్కడ ఉన్నారు?

మరిన్ని వార్తలు