-

‘మహిళలకు సంబంధించిన విషయాల్లో రాజకీయం సరికాదు’

28 Apr, 2022 21:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అత్యాచార బాధితుల వద్ద రాజకీయడం చేయడం టీడీపీకి అలవాటైపోయిందని మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హాస్పిటళ్ల వద్ద రాజకీయం చేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఏ ఘటన జరిగినా టీడీపీ నేతలు మృతదేహాలను కదలనివ్వకుండా అంత్యక్రియలు జరగనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ మహిళలకు సంబంధించిన విషయాల్లో రాజకీయం సరికాదని హితవు పలికారు.

వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. దుగ్గిరాల ఘటనలో పోలీసులు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారని తెలిపారు. సమాచారం తెలియగానే జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. తెనాలి మార్చురీ వద్ద లోకేష్ వస్తున్నారని మృతదేహాన్ని అంత్యక్రియలకు పంపకుండా అడ్డుకోవడం దుర్మార్గపు చర్చ అని విమర్శించారు. తిమ్మపూడిలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించి, అంత్యక్రియలు సజావుగా జరగకుండా చేస్తున్నారని అన్నారు.

‘బాధితుల వద్ద రాజకీయ ఆందోళనలు చేయడం బాధాకరం. మహిళలకు సంబంధించిన సంఘటనలు జరిగినప్పుడు మహిళా కమిషన్ సమర్ధవంతంగా పని చేస్తోంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పది లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. మృతురాలి పిల్లల చదువుకు అన్ని చర్యలు తీసుకున్నారు. మృతురాలి భర్త పేర్లు చెప్పినవారినే అరెస్ట్ చేశారు. అనేక రాజకీయ అంశాలు ఉండగా మహిళా కమిషన్‌ను సైతం టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు అన్ని రాష్ట్రాల్లో పెరిగాయి. కానీ ఏపీలో మాత్రమే అత్యాచారాలపై రాజకీయాలు చేస్తున్నారు.’ అంటూ వాసిరెడ్డి పద్మ ప్రతిపక్ష టీడీపీపై నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు