ఫిర్యాదు చేసుకోండి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం

23 Sep, 2020 13:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో సముద్రమంత మార్పు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో కనిపిస్తోందని విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'డైనమిక్ సీఎం వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేని పనులు వైఎస్‌ జగన్‌ పాలనలో జరుగుతున్నాయి. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. 14 నెలల్లో 59 వేల కోట్లు ప్రజాసంక్షేమానికి ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు.

14 నెలలు మనుసు చంపుకొని టీడీపీలో పని చేశాను. ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక సూచన చేయాలి, కానీ అది జరగడం లేదు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష పార్టీకి పని లేకుండా చేశారు. ప్రతిపక్ష పార్టీగా పేదవాడి నోట్లో మట్టి కొట్టొద్దు. నాకు పార్టీలో ఏ పని అప్పగించిన బాధ్యతతో పని చేస్తా. సౌత్ నియోజకవర్గ పనుల కోసం బంట్రోతులా తిరిగిన టీడీపీ హయాంలో పనులు జరగలేదు. సూటు బూటు వేసుకున్న వారికే టీడీపీ ప్రభుత్వంలో పనులు జరిగాయి. అభివృద్ధికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ సూచన చేసింది. పేదల కోసం ఉద్యమాలు చేయమని టీడీపీ చెప్పలేదు. కోర్టులకు వెళ్లి పేదల ఇళ్ల స్థలాలు అడ్డుకున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీకి మనుగడ లేదు.

20 లేదా 30 ఏళ్లు సీఎంగా జగన్‌మోహన్‌ రెడ్డి ఉంటారు. మనుసు చంపుకొని పార్టీ ఆదేశాల మేరకు సీఎంపై విమర్శలు చేశాను. మనసు చంపుకొని టీడీపీలో ఉండలేకపోయాను. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. నాపై అనర్హత ఫిర్యాదు చేసుకోమనండి. రాష్ట్రానికి, పేద ప్రజలకు సీఎం జగన్‌ ఒక లైఫ్ ఇచ్చారు. అమ్మఒడి, రైతు భరోసా వంటి కార్యక్రమాలు అమలు చేశారు. విశాఖపట్నంలో లేని ఉద్యమాలు చేయమంటే ఎలా చేస్తాను. రాజ్యాంగం మీద సీఎం జగన్‌ ప్రమాణం చేసినప్పుడే కులాలు, మతాలకు సంబంధం లేదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు డిక్లరేషన్ అనడం కరెక్ట్ కాదు. (తప్పు చేయకుంటే భయమెందుకు?)

పరిపాల రాజధాని ప్రకటించిన రోజే నేను స్వాగతించాను. కొంతమంది రాక్షసుల్లా పరిపాలన రాజధాన్ని అడ్డుకుంటున్నారు. వైజాగ్ కు పరిపాలన రాజధాని అయ్యే అర్హత లేదా. నా పేరు మీద అమరావతికి మద్దతుగా నాకు తెలియకుండా లేఖ విడుదల చేశారు. నేను పార్టీ ద్రోహిని అయితే చంద్రబాబు పేదల ద్రోహి' అంటూ విశాక సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (రాష్ట్ర అభివృద్ధి అంశాలపై అమిత్‌ షాతో చర్చ)

మరిన్ని వార్తలు