కుట్రకోణంపై దర్యాప్తు జరుగుతోంది 

10 Sep, 2020 06:34 IST|Sakshi
వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు

తగులబెట్టడం, కూల్చివేయించడం వంటి నీచ సంస్కృతి బాబుదే 

మంత్రి వెలంపల్లి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ విష్ణు ఆగ్రహం 

సాక్షి, అమరావతి: అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తక్షణమే స్పందించి అలసత్వం వహించిన అధికారులను సస్పెండ్‌ చేశారన్నారు. ఫిబ్రవరిలో స్వామివారి రథోత్సవం నాటికి కొత్త రథాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారని చెప్పారు. దీనికి రూ.95 లక్షలు విడుదల చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వెలంపల్లి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. 

► తగలబెట్టడం, కూల్చివేయించడం వంటి నీచ సంస్కృతి చంద్రబాబుదే. తునిలో రైలు దగ్ధం, రాజధానిలో అరటి తోటలు తగులబెట్టించడం, పుష్కరాల పేరుతో 40 ఆలయాలను కూల్చేయడం బాబు హయాంలోనే జరిగాయి.  
► టీడీపీ, బీజేపీ, జనసేనలు మత రాజకీయాలు చేస్తూ మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. ప్రభుత్వానికి కులాలు, మతాలను అంటగట్టే కుట్ర పన్నుతున్నారు.
రథ నిర్మాణానికి ప్రత్యేకాధికారి అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ రథ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రత్యేకాధికారిని నియమించింది. కొత్త రథం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసే బాధ్యతలను దేవదాయ శాఖలో అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న రామచంద్ర మోహన్‌కు అప్పగించింది. ఈ మేరకు ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు