మత విద్వేషాలు రెచ్చగొడితే అంతు చూస్తాం

18 Jan, 2021 05:04 IST|Sakshi

మాది భయపడే ప్రభుత్వం కాదు 

నిజాలు నిగ్గు తేల్చిన డీజీపీనే బెదిరిస్తారా? 

చంద్రబాబు, బీజేపీ నేతలపై మంత్రి వెలంపల్లి ఫైర్‌ 

సాక్షి, అమరావతి: చంద్రబాబు మాదిరి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రభుత్వం కాదని, మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ శక్తుల అంతు చూస్తుందని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. డీజీపీ లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్థన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీని బెదిరించడం దారుణమన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టిన రాజకీయ శక్తుల వివరాలు ఆధారాలతో సహా వెల్లడించిన డీజీపీని తమ ప్రభుత్వం సమర్థిస్తోందని తెలిపారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

డీజీపీ ఎందుకు రాజీనామా చేయాలి? 
‘‘దేవాలయాలపై దాడులు చేసిందెవరో? ఎప్పుడో జరిగిన సంఘటనలను ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందెవరో డీజీపీ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డీజీపీని బెదిరిస్తూ లేఖ రాయడం, రాజీనామా చేయాలనడం ఏమిటి? డీజీపీ ఎందుకు రాజీనామా చేయాలో వీర్రాజు చెప్పాలి. వాస్తవాలు వెల్లడించినందుకా? మీవైపు మాట్లాడనందుకా? ఎమ్మెల్సీ మాధవ్‌ కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్నాడు. చేసుకోండి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎవరికీ భయపడదు. తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న లక్ష్యంతో సోషల్‌ మీడియా ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తాం.
   
అంతర్వేదిపై ఎందుకు మాట్లాడటం లేదు?  
రామతీర్థం ఘటన జరిగి పది రోజులైనా దోషులను పట్టుకోలేదని రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేస్తున్న బీజేపీ నేతలు.. అంతర్వేది ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదు. దీనిపై సీబీఐ విచారణ కోరుతూ గత ఏడాది సెప్టెంబర్‌ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. నాలుగు నెలలైనా ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ఎందుకు బయటపెట్టలేదు? కేంద్రంలో ఉన్నది మీరేగా..దోషులను ఎందుకు పట్టుకోలేదు?  

క్షుద్రపూజల చంద్రబాబుకు మాట్లాడే హక్కే లేదు 
దేవుడంటే భయం, భక్తీ లేకుండా బూట్లేసుకుని దేవుడి దగ్గరకెళ్ళే వ్యక్తి చంద్రబాబు.  క్షుద్రపూజలు, తాంత్రిక పూజలు చేసే ఆయనకు అసలు హిందూ మతం, దేవుడి గురించి మాట్లాడే నైతిక హక్కేలేదు. చంద్రబాబుకు నిజాలు చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం ఉంది. బీజేపీ నేతలు కూడా ఆయన తరహాలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. 

టీడీపీ కూల్చేసిన గుళ్లను మేం కట్టిస్తున్నాం 
2014–19 మధ్య దేవాలయాల అభివృద్ధికి కేవలం రూ.150 కోట్లే మంజూరు చేస్తే... మా ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రూ.168 కోట్లు ఖర్చు పెట్టింది. టీడీపీ కూల్చేసిన గుళ్ళను తిరిగి కట్టిస్తున్న ఘనత మా ప్రభుత్వానిది. అలాగే గుడికో గోమాత పథకాన్ని తీసుకొచ్చాం. సీఎం జగన్‌ 2,500 దేవాలయాల్లో గోమాతకు పూజా కార్యక్రమం చేపట్టారు..’’ అని వెలంపల్లి అన్నారు.    

>
మరిన్ని వార్తలు