డ్రగ్స్‌ ఉన్మాదుల్లా టీడీపీ నేతలు

23 Sep, 2021 03:37 IST|Sakshi

ప్రవాసాంధ్రుల్లాంటి చంద్రబాబు, లోకేశ్‌ రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చాలని ప్రయత్నిస్తే సహించం: మంత్రి వెలంపల్లి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ మినహా రాష్ట్రంలో మిగతా పార్టీలకు చోటు లేదని పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు మరోసారి తీర్పు చెప్పారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ‘మాకు కావాల్సింది దిక్కుమాలిన అబద్ధాలు చెప్పే చంద్రబాబు కాదు.. సంక్షేమాభివృద్ధి పథకాలను చేతల్లో అమలు చేసే సీఎం వైఎస్‌ జగన్‌’ అని ప్రజలు మరోసారి స్పష్టం చేశారన్నారు. రాజకీయంగా ఉనికి కోల్పోవడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్, అయ్యన్నపాత్రుడు, బొండా ఉమా, పట్టాభి మత్తు మందులు సేవించిన ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని తులసి వనంలా తీర్చిదిద్దుతుంటే  టీడీపీలోని గంజాయి మొక్కలు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

కుట్రలను చిత్తు చేసిన ప్రజలు..
అధికారం కోల్పోవడంతో విపక్ష టీడీపీ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి చేయని కుట్ర లేదని మంత్రి అన్నారు. దేవుడి విగ్రహాల ధ్వంసం.. రథాలకు నిప్పు లాంటి వాటిని ఆసరాగా చేసుకుని చంద్రబాబు విద్వేషాలు రేకెత్తించాలని ప్రయత్నించారని గుర్తు చేశారు. ఆ తర్వాత కులాలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నారని చెప్పారు. వీటిని గుర్తించిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్‌ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగినా టీడీపీని అడ్రస్‌ లేకుండా ఓడించారని గుర్తు చేశారు.

టీడీపీ కార్యాలయంలో దొరుకుతాయేమో?
డ్రగ్స్‌తో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని నగర పోలీసు కమిషనర్‌ స్పష్టంగా ప్రకటించారని వెలంపల్లి గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో డ్రగ్స్‌కు రాష్ట్రంలో తావు లేదని, టీడీపీ కార్యాలయంలో ఏమైనా దొరుకుతాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు.  అతిథులుగా వచ్చి అతిథిగృహాల్లో ఉండే ప్రవాసాంధ్రుల్లాంటి చంద్రబాబు, లోకేశ్‌ ఇకనైనా కుట్రలు మానుకోవాలని, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. ఫామ్‌హౌస్‌లో పడుకునే పార్టీ నేత కూడా విజయవాడ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. .     

మరిన్ని వార్తలు