మత విద్వేషాలు రెచ్చగొట్టడం తగదు

5 Oct, 2021 04:18 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

చంద్రబాబు దేవాలయాలను కూల్చివేసినప్పుడు ఏం చేశావ్‌?

పవన్‌ కల్యాణ్‌కు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి ప్రశ్న 

చోడవరం: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని పవన్‌ కల్యాణ్‌కు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హితవు పలికారు. చంద్రబాబు హయాంలో విజయవాడలో దేవాలయాలను కూల్చేసి, విగ్రహాలను చెత్త కుప్పలపై వేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఏం చేశారని ప్రశ్నించారు. విశాఖ జిల్లా చోడవరంలో సోమవారం జరిగిన దేవదాయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న ప్రజాసంక్షేమ పాలన చూసి ఓర్వలేక టీడీపీ, పవన్, బీజేపీలు దేవుళ్లను అడ్డుపెట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇతర మతస్తులను హిందువులే రెచ్చగొడుతున్నారని గత ఎన్నికల ముందు పవన్‌ చెప్పలేదా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆలయాలు, అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. రూ.70 కోట్లు వెచ్చించి విజయవాడ దుర్గమ్మ గుడిని అభివృద్ధి చేస్తున్నారని.. త్వరలో బంగారు రథాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విగ్రహాలను ధ్వంసం చేసింది టీడీపీ నేత అచ్చెన్నాయుడు మనుషులేనని, రాజమండ్రిలో జరిగిన ఘటనలకు టీడీపీ నాయకులే కారణమని ఆధారాలతో సహా బయట పెట్టామన్నారు. అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐకి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. బీజేపీ మిత్రపక్షమని చెబుతున్న పవన్‌ కల్యాణ్‌ దీనిపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదని మంత్రి వెల్లంపల్లి నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎంపీ బి.వి.సత్యవతి పాల్గొన్నారు.    

శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి
సింహాచలం(పెందుర్తి): విశాఖలోని శ్రీ శారదా పీఠాన్ని మంత్రి వెలంపల్లి సందర్శించారు. పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని స్వామిని మంత్రి ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు