బాబుకు విజయవాడలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు

6 Mar, 2021 19:40 IST|Sakshi

సాక్షి, కృష్ణా: విజయవాడలో ఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగరవేయబోతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా సీఎం జగనన్న అభ్యర్థులకు ఓటు వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు విజయవాడలో అడుగు పెట్టే ముందు ఆయన పార్టీకి చెందిన నలుగురు నాయకుల మాటలకు సమాధానం చెప్పాలన్నారు. బీసీలు, కాపులు, మైనార్టీలకు టీడీపీ మోసం చేస్తోందని ఆ పార్టీ వారే గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న వారితో కలిసి తిరుగుతున్న నేతల తీరుపై పట్ల చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుకు విజయవాడలో అడుగు పెట్టే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. విజయవాడ అభివృద్ధికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కుప్పంలో ఫలితాలు చూసి చంద్రబాబుకు మైండ్ పోయిందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజలు వైఎస్సార్‌సీపీని ఆదరిస్తున్నారని, టీడీపీ ఐదేళ్ల పాలనలో విజయవాడలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. చంద్రబాబు పాలన అంతా హత్యలు, కుట్రలు అన్న చందంగా సాగిందని మండిపడ్డారు. తమ 20 మాసాల పాలనలో రూ.600 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. టీడీపీ ఓటు వేస్తే నగరం అభివృద్ధికి నోచుకోదని, ఆ పార్టీ వారే టీడీపీ ఒక కులానికి కొమ్ము కాస్తోందని రోడ్డెక్కారని మండిపడ్డారు. చంద్రబాబు నగరానికి వచ్చే ముందు తాను చేయని అభివృద్ధిపై ప్రజలకు క్షమాపణ చెప్పిరావాలన్నారు. గత ఐదు సంవత్సరాలు టీడీపీ చేసిన నష్టాన్ని భర్తీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ బంగాళాఖాతంలో కలిసి పోవడానికి గల కారణం ఏంటో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు. నగరంలో లక్ష మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదల ఆరోగ్యానికి సీఎం జగన్‌ పెద్దపీట వేశారని గుర్తుచేశారు. చంద్రబాబు నగరంలో అడుగు పెట్టే ముందు వంగవీటి రంగా అభిమానులకు క్షమాపణ చెప్పి రావాలన్నారు.

చదవండి:  చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదు

మరిన్ని వార్తలు