సోము వీర్రాజు దేశ భక్తుడా? తెలుగుదేశం భక్తుడా?: వెల్లంపల్లి

22 Jan, 2022 17:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడైన సోము వీర్రాజు దేశ భక్తుడా? తెలుగుదేశం భక్తుడా? అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో కలిసి ఆలయాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని వెల్లంపల్లి విమర్శించారు. సోము వీర్రాజు కార్పొరేటర్‌గా కూడా పనికిరాని వ్యక్తి అని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా? అని సూటిగా ప్రశ్నించారు.

సోము వీర్రాజు, సీఎం రమేష్‌, సుజనా చౌదరిలు రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులని అన్నారు. చంద్రబాబుకు కొందరు బీజేపీ వలస పక్షులు అమ్ముడుపోయారని విమర్శించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్‌ జగన్‌ పాలన చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు 40 దేవాలయాలు కూలిస్తే సోము వీర్రాజు ఏం చేశారని ప్రశ్నించారు.

టీడీపీతో కలిసి ప్రభుత్వం పంచుకుంటూ గుడులు కూల్చిన ఘనత బీజేపీదేని మండిపడ్డారు. ఆయన సోము వీర్రాజు కాదని, సారా వీర్రాజు అని ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తి.. వైఎస్సార్‌సీపీపై మత, కుల ముద్ర వేయాలని చూస్తున్నారని ఆగ్రహం‍ వ్యక్తంచేశారు. ఏపీలో బీజేపీని ఎవరూ పట్టించుకోరని, అందుకే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు