గవర్నర్‌ తమిళిసైకి నైతిక విలువలు లేవు.. మంత్రి వేముల ఫైర్‌

25 Sep, 2023 16:35 IST|Sakshi

గవర్నర్‌ తమిళిసై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఫైర్‌

గవర్నర్‌గా ఆమెకు కొనసాగే అర్హత లేదు, నైతిక విలువలు లేవు

బీజేపీ చీఫ్‌గా ఉన్న తమిళిసై.. గవర్నర్‌గా రాలేదా?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీ కోటాలో పంపిన(దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ) సిఫార్సులను గవర్నర్‌ తిరస్కరించారు. ఈ క్రమంలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించలేనని, అర్హుల పేర్లను ప్రతిపాదించాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో, గవర్నర్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టే..
తాజాగా, తెలంగాణ గవర్నర్‌ తమిళిసైపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. మంత్రి ప్రశాంత్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత తమిళిసై సౌందరరాజన్‌కి లేదు. ఆమె రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని పాలిటిక్స్‌ చేస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను  రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపి పంపితే వారికి రాజకీయా నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గం. అత్యంత వెనుక బడిన కులాలకు(ఎంబీసీ)చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్, షెడ్యుల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణ లను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అగౌరపర్చినట్టే. 

అప్రజాస్వామిక నిర్ణయం..
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమించబడబడలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్‌కు నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలి. సర్కారియ కమిషన్ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధంలేని వారిని గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. సర్కారియ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్‌గా నియమించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మరిన్ని వార్తలు