గౌరీ అమ్మ ఇక లేరు: గవర్నరు, సీఎం సంతాపం

11 May, 2021 14:41 IST|Sakshi

ఆధునిక కేరళకు పునాదులు వేసిన పోరాట యోధురాలు గౌరీ అమ్మ

తిరువనంతపురం: కేరళ  ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీమంత్రి నేత కేఆర్‌ గౌరీ కన్నుమూశారు. కేరళ రాజకీయాల్లో ఐరన్ లేడీగా పేరుగాంచిన కేఆర్ గౌరీ తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. మరికొన్ని వారాల్లో ఆమె 102వ పుట్టిన రోజులు జరుపుకునేవారు. కేరళ గవర్నరు, ముఖ్యమంత్రి సహా పలువురు రాజకీయ నేతలు, ఇతర  ప్రముఖులు గౌరీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాలాతో సహా పార్టీ సీనియర్ నాయకులు ఆమె స్వస్థలమైన అలప్పులో  ఘనంగా నివాళులు అర్పించారు.

‘‘దోపిడీకి వ్యతిరేకంగా సమ సమాజ నిర్మాణంకోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధురాలు. మరింత ప్రగతిశీల సమాజాన్నినిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఆమెకిచ్చే నివాళి. రెడ్ సెట్యూట్‌’’ అని సీఎం విజయన్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో భూసంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి ఆమె చేసిన కృషి చిర స్మరణీయమని గవర్నరు సంతాపం తెలిపారు. అసాధారణమైన ధైర్యం, ఉత్తేజకరమైన నాయకత్వంతో మహిళా సాధికారతకు నిజమైన చిహ్నంగా నిలిచారన్నారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం చేసిన ఆమె  పోరాటాలు కేరళ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని ట్వీట్‌ చేశారు. ఆధునిక కేరళకు పునాదులు వేసిన వారిలో కేఆర్ గౌరీ అమ్మ ఒకరని  ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆమెకు నివాళులర్పించారు. మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఆమె అని గుర్తు చేసుకున్నారు. 

ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేరళలోని రాజకీయ రంగాలలో అనేక కీలక ఫైనాన్స్, పరిశ్రమలు మంత్రి పదవులను  చేపట్టారు.  గౌరీ అమ్మ చారిత్రాత్మక భూస్వామ్య వ్యతిరేక భూ సంస్కరణల చట్టాన్ని తీసుకు రావడంలో  ఆమె చేసిన కృషి అమోఘం. భూమిలేని రైతులకు భూమిని సొంతం చేసుకోవడానికి మార్గం సుగమమైంది.1952లో ట్రావెన్కోర్-కొచ్చిన్ శాసనసభకు ఎన్నిక కావడంతో గౌరీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1957లో కమ్యూనిస్ట్ లెజెండ్ ఇఎంఎస్ నంబూద్రిపాత్‌ నేతృత్వంలోని ప్రపంచంలోని మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. 1960 లలో కమ్యూనిస్టులు విడిపోయిన తరువాత, గౌరీ సీపీఎంలో చేరారు, ఆమె భర్త మరో ముఖ్య నాయకుడు  టీవీ థామస్  సీపీఐలో చేరారు. మొదటి కేరళ శాసనసభ నుండి 1977 వరకు ఆమె ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మొత్తం ఆరు క్యాబినెట్లలో 16 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు