జగదీప్‌ ధన్‌కర్‌ గురించి తెలుసా? మారుమూల పల్లెలో ‘రైతు బిడ్డ’ నుంచి..

16 Jul, 2022 20:30 IST|Sakshi

ఢిల్లీ: రాజస్థాన్‌కు చెందిన సీనియర్‌ పొలిటీషియన్‌, సీనియర్‌ న్యాయవాది.. అన్నింటికి మించి బెంగాల్‌ గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉన్న జగదీప్‌ ధన్‌కర్‌(71)ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. కష్టం, స్వశక్తితో ఎదిగిన మనిషిగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో..

Jagdeep Dhankhar Profile 
 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా కితానా అనే ఓ మారుమూల పల్లెలో జన్మించారు ఆయన.

జగదీప్‌ ధన్‌కర్‌ ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అంచెలంచెలుగా ఎదిగి న్యాయనిపుణుడిగా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కించుకున్నారు. 

కాలినడకనే రోజూ 4 నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్లి చదువుకునేవాడినని పలు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకునేవారు ఆయన. అంతేకాదు పిల్లలంటే ఆయనకు ఎంతో మమకారం.

► గవర్నర్‌గా విధులు నిర్వహించే సమయంలోనూ వీలు చేసుకుని మరీ విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లి మరీ వాళ్లను ప్రోత్సహించేలా ఉపన్యాసాలు ఇచ్చేవారాయన.

► చిత్తోర్‌ఘఢ్‌ సైనిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య, జైపూర్‌ రాజస్థాన్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.  

► జనతాదళ్‌ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో(1989-91) ఆయన మంత్రిత్వ శాఖను చేపట్టారు కూడా.

► 1993-98 మధ్య కిషన్‌గఢ్‌ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా పని చేశారు.

► రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వహించారు.

► అంతేకాదు ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లోనూ మెంబర్‌గా పని చేశారు. కొన్నాళ్లపాటు సుప్రీం కోర్టులోనూ ఆయన పని చేశారు. 

► 2003లో ఆయన బీజేపీలో చేరారు.

► 2019లో ఆయన్ని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. 

గవర్నర్‌ పేషీలో ఓఎస్డీగా తన దగ్గరి బంధువును నియమించారనే రాజకీయ ఆరోపణ మాత్రం ఆయన్ని ఇబ్బంది పెట్టింది.

► భార్య సుదేశ్‌ ధన్‌కర్‌. కామ్నా కూతురు. అల్లుడు కార్తీకేయ వాజ్‌పాయి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. 

మైనార్టీ కోటాలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తారని అంతా భావించినా.. ధన్‌కర్‌ పేరును తెరపైకి తెచ్చి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది బీజేపీ. శుక్రవారం సాయంత్రం హోం మంత్రి అమిత్‌ షాతో ధన్‌కర్‌ భేటీ కావడం, ఆపై శనివారం ప్రధాని మోదీతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారినా.. ఇలా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఊహించలేదు.

చదవండి: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌కర్‌

మరిన్ని వార్తలు