ఇక దూకుడే!

4 Nov, 2021 01:25 IST|Sakshi

హుజూరాబాద్‌లో ఈటల గెలుపుతో కమలదళంలో ‘ఫుల్‌ జోష్‌’ 

గులాబీ, హస్తం పార్టీలను ఢీకొనేలా పోటాపోటీగా కార్యక్రమాలు 

16న నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌!.. 21 నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర 

2023 సంవత్సరమంతా పకడ్బందీ వ్యూహాలతో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో గెలుపుతో కమలదళంలో ఉత్సాహం నెలకొంది. దూకుడు మరింత పెంచాలని, అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలతో ఢీ అంటే ఢీ అనేలా ముందుకెళ్లాలని నిర్ణయించింది. పకడ్బందీ వ్యూహం, కచ్చితమైన రాజకీయ కార్యాచరణ అమలు చేయాలని.. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో.. ఒక ఏడాది పాటు అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించాలని.. తర్వాతి ఏడాది పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధంకావాలని నిర్ణయించింది. 

పాదయాత్రపై మరింత ఫోకస్‌.. 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర’కు జనంలో ఆదరణ కనిపిస్తోందని ఆ పార్టీ చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రభుత్వ పెద్దలు, మంత్రులపై నేరుగా విమర్శలు, సవాళ్లు చేస్తూ.. టీఆర్‌ఎస్‌ తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి కల్పించామని గుర్తు చేస్తోంది. ఈ క్రమంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు ప్రజల దృష్టిని ఆకర్షించాయని పేర్కొంటోంది. తాజాగా హుజూరాబాద్‌లో ఈటల గెలుపు నేపథ్యంలో.. ఈ వ్యూహానికి మరింత పదునుపెట్టి, దీర్ఘకాలిక కార్యాచరణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 

16న నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌! 
టీఆర్‌ఎస్‌ సర్కారు ఉద్యోగాల భర్తీ హామీని విస్మరించిందనే అంశాన్ని పెద్దఎత్తున తీసుకెళ్లాలని, తద్వారా నిరుద్యోగులు, యువతకు బీజేపీ అండగా నిలుస్తుందనే భరోసా ఇవ్వాలని నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు. తెలంగాణ ఉద్యమం నాటి మిలియన్‌ మార్చ్‌ తరహాలో.. నిరుద్యోగ మిలియన్‌ మార్చ్, హైదరాబాద్‌ దిగ్బంధనం, మానవహారం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 16న హైదరాబాద్‌లో నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

నిజానికి ఈ నెల 15న టీఆర్‌ఎస్‌ సభ ఉండటంతో.. పోటీగా 12వ తేదీనే నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌ను నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. కానీ 12న జాతీయ పోలీస్‌ అకాడమీలో జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తుండడం, టీఆర్‌ఎస్‌ సభ ఈనెల 29కు వాయిదా పడడంతో.. ఈ నెల 16న మిలియన్‌ మార్చ్‌ను చేపట్టాలని నిర్ణయించింది. హుజూరాబాద్‌ పోలింగ్‌కు ముందు రైతుల సమస్యను ఎత్తిచూపినట్టుగానే.. టీఆర్‌ఎస్‌ సభకు ముందు నిరుద్యోగ సమస్యపై వేడి పుట్టించాలని భావిస్తోంది.

ఇక ఈ నెల 21 నుంచి రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను దక్షిణ తెలంగాణలో మొదలుపెట్టాలని బీజేపీ భావిస్తోంది. మొత్తంగా 2022 చివరికల్లా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రను పూర్తి చేయాలని.. 2023లో పకడ్బందీ వ్యూహాలతో శాసనసభ ఎన్నికలకు రెడీ కావాలని నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు