చంద్రబాబు అంటేనే మోసం

10 Nov, 2022 05:04 IST|Sakshi
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి విడదల రజని

వైఎస్‌ జగన్‌ అంటే సంక్షేమం

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని

గుంటూరు మెడికల్‌/యడ్లపాడు: టీడీపీ అధినేత చంద్రబాబు అంటేనే మోసం అని.. రాష్ట్ర ప్రజలు ఆయనపై పూర్తిగా నమ్మకం కోల్పోయారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని విమర్శించారు. ఈ నెల 11న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 75 వసంతాల పైలాన్‌ ఆవిష్కరణ మహోత్సవానికి, యడ్లపాడు మండలం మైదవోలు–వంకాయలపాడు గ్రామాల పరిధిలోని స్పైసెస్‌ పార్క్‌కు విచ్చేస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు.

అనంతరం గుంటూరు, మైదవోలులో మీడియాతో మంత్రి రజని మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగనన్న పారదర్శక పాలన సాగిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లోని నాయకులు సీఎం జగనన్నను అభినందిస్తూ.. ఆదర్శంగా ఆయా పథకాలను తమ ప్రాంతాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. దీనిని చూసి ఓర్వలేక చంద్రబాబు నిత్యం ప్రభుత్వంపై బురదచల్లే పనిలో పడ్డారని, అందుకు పచ్చమీడియా ఊతం అందిస్తోందని విమర్శించారు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రజలను మోసం చేశారని, మళ్లీ మోసం చేయడానికే ఆయన ప్రజల ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో వైద్య, ఆరోగ్య రంగానికి తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఆయన హయాంలో ఒక్క ఆస్పత్రికి కూడా మరమ్మతులు చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ తనయుడిగా జగనన్న ప్రజలకు మరింత మేలు చేసేలా అడుగులు ముందుకు వేస్తున్నారని, ఏకంగా రూ.16వేల కోట్లతో వైద్య, ఆరోగ్య రంగంలో వసతులను పూర్తిస్థాయిలో పెంచుతున్నారని తెలిపారు.

మంత్రి వెంట ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, సీఎం కార్యాలయం స్పెషల్‌ సెక్రటరీ డాక్టర్‌ హరికృష్ణ, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, డీఎంఈ వినోద్‌కుమార్, ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు