మూడు రాజధానులకు ప్రజల మద్దతు

15 Mar, 2021 04:02 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సత్యవతి తదితరులు

విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా జనామోదం

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానుల నిర్ణయానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలుపుతూ పురపోరులో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఆమోదించి మెజార్టీ స్థానాల్లో గెలిపించారన్నారు. ఆదివారం విశాఖపట్నం మద్దిలపాలెం పార్టీ నగర కార్యాలయంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లి మీకు రోషం.. పౌరుషం లేదా? అంటూ చంద్రబాబు రెచ్చగొట్టాడని.. అక్కడి ప్రజలు తమ రోషం, పౌరుషాన్ని చక్కగా ఆయనపైన చూపించారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల రోజు చంద్రబాబునాయుడు ఏపీలో లేకుండా ముఖం చాటేశాడంటే.. ఆయన పరిస్థితేంటో అర్థం చేసుకోవాలన్నారు. ‘‘ఏపీ ప్రజలు పాచి పనులకోసం వేరే రాష్ట్రాలకు పోతున్నారని బాబు అన్నారు. మరి ఆయన కొడుకు, ఆయన హైదరాబాద్‌లోని పాచి పనులకోసం వెళ్లారా? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే మాట కాదా?’’ అని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఏపీకి రావడానికి ముఖం కూడా చెల్లని చంద్రబాబు, ఆయన తనయుడు భవిష్యత్తులో రాష్ట్రానికి వచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. 

మరో 25 ఏళ్లపాటు సీఎంగా వైఎస్‌ జగన్‌...
మరో 25 ఏళ్లు సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉంటారని, ప్రజల ఆకాంక్ష కూడా అదేనని విజయసాయిరెడ్డి చెప్పారు. 13 జిల్లాల్లోని ఐదుకోట్ల మంది ప్రజల మనసుల్లో జగన్‌ గూడు కట్టుకున్నారన్నారు. జగన్‌ చేసిన అభివృద్ధే స్థానిక ఎన్నికల్లో, పురపాలక ఎన్నికల్లో పార్టీని గెలిపించిందన్నారు. మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను మించి పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధికంగా గెలుపొందిందన్నారు. విశాఖ ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడు ఏమీ చేయలేకపోయారని, ఆ పార్టీ జెండాను ప్రజలే పీకేశారని విమర్శించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎంపీ భీశెట్టి సత్యవతి, ప్రభుత్వ సలహాదారు సాగి దుర్గాప్రసాద్‌రాజు, ఎమ్మెల్యే  అమర్‌నాథ్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు