బీసీల మద్దతుంటే ఎందుకు ఓడారు బాబూ? 

23 Sep, 2022 04:41 IST|Sakshi

వైఎస్సార్‌పీపీ నేత విజయసాయిరెడ్డి 

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు (బీసీలు) చంద్రబాబు వెనకనుంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు అంతటి చారిత్రక ఓటమి పాలైందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర బీసీ సాధికారక కమిటీ పేరుతో జరిగిన సదస్సులో టీడీపీ అధినేత ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేదని.. కానీ, ఓబీసీలందరూ తెలుగుదేశం పక్షానే ఉన్నారని ప్రకటించడం ఆశ్చర్యం కల్గిస్తోందని గురువారం ఆయనొక ప్రకటనలో తెలిపారు.

చంద్రబాబు పాలనలో వెనుకబడిన కులాలు కుదేలయ్యాయని.. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాల్లోని పేదల సంక్షేమాన్ని టీడీపీ మరిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆధిపత్య వర్గాల్లోని పెత్తందారులు, సంపన్నుల ప్రయోజనాలకే ఆ పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. తొలిరోజుల్లో టీడీపీకి ఓ మోస్తరుగా మద్దతు పలికిన బీసీలు, చంద్రబాబు పాలనలో కష్టాలపాలయ్యాక టీడీపీకి దూరమయ్యారని వివరించారు.

2014 ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బీసీల మద్దతు ఆ పార్టీకి అంతంతమాత్రంగానే ఉందన్నారు. టీడీపీకి వచ్చిన ఓట్లు, సీట్లు ఈ విషయం రుజువుచేస్తున్నాయని విజయసాయిరెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, విభజిత ఏపీలో బీసీల ప్రయోజనాలకు భంగం కలిగిందని.. రాజ్యాధికారంలో వారి వాటా కూడా తగ్గిందన్నారు. వీటన్నింటివల్ల మిగిలిన అన్ని సామాజికవర్గాలతో కలిసి వెనుకబడిన కులాలు కూడా వైఎస్సార్‌సీపీకి పెద్దఎత్తున మద్దతు పలికాయని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు