ప్రభుత్వంపై రాళ్లేయడమే టీడీపీ లక్ష్యం

23 Aug, 2022 04:58 IST|Sakshi

పలాసలో లోకేశ్‌ సృష్టించిన వీరంగమే ఇందుకు నిదర్శనం 

వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధ్వజం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై సరైన కారణం లేకుండా రాళ్లేయడానికి లోకేశ్‌ అండ్‌ కంపెనీ విశ్వప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అలజడి సృష్టించడానికి వారు చేస్తున్న హడావుడే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పలాసలోని ఒక కాలనీలో అక్రమ నిర్మాణాలను కోర్టు ఆదేశాల ప్రకారం తొలగించడానికి ప్రభుత్వాధికారులు చేసిన ప్రయత్నాన్ని బ్రహ్మాస్త్రంగా మార్చుకోవాలని టీడీపీ పథకం రచించిందన్నారు. దీన్ని అమలు చేసే బాధ్యతను లోకేశ్‌కు అప్పగించిందన్నారు. టీడీపీ సృష్టిస్తున్న అరాచకాలను ప్రభుత్వ యంత్రాంగం అనుమతించకపోవడంతో ఆందోళన చేయడానికి చినబాబు విశాఖపట్నం వరకు వచ్చారని దుయ్యబట్టారు. టీడీపీ అనుకూల మీడియా తోడ్పాటుతో ఓ గొప్ప ప్రజాందోళన నిర్వహించినట్టు స్థానిక ప్రజలకు చిన్న సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..  

ఏదో ఒక సాకుతో ఆందోళనకు పథకాలు..  
‘చంద్రబాబు, లోకేశ్‌కు పగలూ, రాత్రీ అసెంబ్లీ ఎన్నికలే కనిపిస్తున్నాయట. శాసససభ ఎన్నికలకు 20 నెలల సమయం ఉండడంతో తండ్రీకొడుకులిద్దరూ ఏదో ఒక సాకుతో ఆందోళనకు పకడ్బందీగా పథకాన్ని అమలు చేస్తున్నారు. సాధారణ పరిపాలనకు సంబంధించిన చిన్న విషయాలను సైతం సమస్యలుగా చూపించి లోకేశ్‌ టీడీపీ నేతలతో కలిసి రాజకీయ వీధి యుద్ధాలకు సిద్ధమవుతున్నారు. పలాస మునిసిపాలిటీ పరిధిలో ‘అర్ధరాత్రి కూల్చివేతలు.. అక్రమ అరెస్టులు’ అంటూ ఉత్తరాంధ్రలో లోకేశ్, ఆయన భజన బృందం, అమరావతిలో చంద్రబాబు వేస్తున్న వీరంగాలు కేవలం నాటకాలే.

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రలో చట్టవిరుద్ధంగా తీసుకుంటున్న అక్రమ చర్యలు ఏవీ లేవు. ప్రతిపక్ష నేతలను ఎక్కడా అణచివేయలేదు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో నిప్పురాజేసి దాన్ని రాష్ట్రమంతటా అంటించడానికి టీడీపీ చేసిన ప్రయత్నం పారలేదు. విశాఖపట్టణాన్ని రాష్ట్ర పాలనా రాజధానిగా చేయడాన్ని టీడీపీ సర్వశక్తులూ ఒడ్డి అడ్డుకోవడానికి ప్రయత్నించింది.

ఈ విషయాలు ప్రజలకు తెలియనివి కావు. చిన్న అంశాన్ని పట్టుకుని చంద్రబాబు, లోకేశ్‌.. రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా మహా ఉద్యమం నిర్మించడానికి ఎక్కడ లేని ఎత్తుగడలతో రంగంలోకి దిగుతున్నారు. వారి ఆటలు సాగడం లేదనే దుగ్ధతో అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజానీకం టీడీపీ ఆగడాలకు తమ నేలను ప్రయోగశాలగా మార్చుకోవడానికి అనుమతించదు.’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు