బీసీలకే విశాఖ మేయర్‌ పీఠం

9 Mar, 2021 04:09 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పుడో ప్రకటించారు

80కి పైగా వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం

ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖ మేయర్‌ పీఠాన్ని వైఎస్సార్‌ సీపీ బీసీలకే కేటాయించిందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 80కి పైగా వార్డులను వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయమని చెప్పారు. మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనిల్‌కుమార్‌ యాదవ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌లతో కలిసి సోమవారం విశాఖలో పలు వార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ అభివృద్ధి కోరుకునే వారంతా ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ పాలనంతా గ్రాఫిక్‌లు, అబద్ధాల మయమని, బాబుకు ఉన్న సినిమాల పిచ్చినంతా.. పాలనలో ఉపయోగించాడే తప్ప ప్రజల యోగ క్షేమాలను పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూదోపిడీని, ముఖ్యంగా విశాఖలో జరిగిన భూ కుంభకోణాలను ప్రజలు మరిచిపోలేదని అన్నారు. 

తెలుగు దోపిడీ దొంగలను తరిమికొట్టాలి
తెలుగు దోపిడీ దొంగలైన చంద్రబాబు, ఆయన తనయుడిని పురపాలక ఎన్నికల్లో ఘోరంగా ఓడించి ఏపీ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పంచాయతీల్లో పది శాతం కూడా టీడీపీ గెలవలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్నిపల్‌ ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ గెలవనుందని చెప్పారు. తన అనుకూల మీడియా ద్వారా సర్వేలు చేయించుకున్న చంద్రబాబు ఓడిపోతామని తెలిసి విశాఖకు పరిగెత్తుకుంటూ వచ్చారని తెలిపారు. గత ఐదేళ్లలో విశాఖకు చేసిన ఒక పనైనా చెప్పారా? చెప్పడానికి ఏమీ లేక హుద్‌హుద్‌ సమయంలో బస్సులో ఉన్నాను.. బస్సులో తిన్నాను.. అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖకు ఏమీ చేయలేని వాడివి.. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌ గెలిచి విశాఖకు ఏమిచేస్తావు చంద్రబాబూ అని విమర్శించారు.  

మరిన్ని వార్తలు