కేంద్రం కంటే మెరుగ్గానే

29 Jul, 2022 03:45 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి. చిత్రంలో ఇతర ఎంపీలు

ధనిక రాష్ట్రాల అప్పులతో పోల్చినా మెరుగైన స్థితిలోనే ఏపీ: విజయసాయిరెడ్డి

రాష్ట్రం సమర్థ్ధుడైన నాయకుడి చేతిలో ఉంది

రాజపక్సలా చంద్రబాబు పరారీ ఖాయం

టీడీపీ హయాంలోనే ఏపీపై అప్పుల భారం

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఆర్థిక పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఎప్పటికీ శ్రీలంకగా మారదు కానీ చంద్రబాబు మాత్రం రాజపక్సలా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. బాబు త్వరలో సింగపూర్‌ లేదా ఇతర దేశాలకు పరారయ్యే సూచనలున్నాయని తెలిపారు.

చంద్రబాబు హయాంలో ఆయన సొంత కుటుంబంతోపాటు రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్‌ నాయుడు, మరో వ్యక్తి కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరితే ఇప్పుడు సీఎం జగన్‌ ఐదు కోట్ల మందికిపైగా మేలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రంతోపాటు దేశంలోని పలు ధనిక రాష్ట్రాలు చేసిన అప్పులతో పోల్చుకుంటే ఏపీ చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉందని గణాంకాలతో సహా వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పార్టీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిధున్‌రెడ్డి తదితరులతో కలసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

► ఆంధ్రప్రదేశ్‌ సమర్థుడైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. 2021–22లో కేంద్ర ప్రభుత్వ అప్పులు–జీడీపీ నిష్పత్తి 57 % కాగా ఏపీలో 32.4% మాత్రమే ఉంది. పంజాబ్‌ 47%, రాజస్థాన్‌ 39.8%, పశ్చిమ బెంగాల్‌ 38.8%, కేరళ 38.3%తో ఏపీ కంటే ముందున్నాయి.
► రుణాలు – జీఎస్డీపీ నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ 5వ స్థానంలో ఉంది. ఏపీ రెవెన్యూ లోటు రూ.8,500 కోట్లు కాగా ద్రవ్యలోటు రూ.25,194.62 కోట్లు. రాష్ట్ర ద్రవ్యలోటు జీఎస్డీపీతో పోల్చుకుంటే 2.1% కన్నా తక్కువే. 15వ ఆర్థిక సంఘం సూచించిన 4.5% పరిమితి కంటే ఇది తక్కువే. 
► 2021–22లో కేంద్ర ద్రవ్యలోటు 6.9% కాగా ఏపీ ద్రవ్యలోటు 3.18% మాత్రమే.
► 2019–20లో శ్రీలంక వ్యాపార ఎగుమతులు 12.9 బిలియన్‌ డాలర్లు కాగా ఏపీ ఎగుమతులు రూ.85,665 కోట్లు. 
► 2021లో శ్రీలంక ఎగుమతులు 12 బిలియన్‌ డాలర్ల వద్దే స్తంభించగా ఏపీ ఎగుమతులు ఏకంగా 62% పెరిగి రూ.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
► 2021–22లో మన దేశానికి వచ్చిన విదేశీ చెల్లింపులు 87 బిలియన్‌ డాలర్లు కాగా శ్రీలంకకు వచ్చినవి 5.49 బిలియన్‌ డాలర్లు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన విదేశీ చెల్లింపులు 4.35 బిలియన్‌ డాలర్లు. విదేశీ చెల్లింపుల రాకతో ఏపీలో సుస్థిర పెరుగుదల నమోదైంది. 
► 2015–16లో పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.14.4 లక్షల కోట్లు కాగా 34.91% మాత్రమే రాష్ట్రాలకు వాటాగా ఇచ్చింది. అందులో ఏపీకి వచ్చింది 1.50% మాత్రమే. 2021–22లో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయం రూ.28 లక్షల కోట్లకు పెరిగినా ఏపీకి ఇచ్చిన వాటా 1.32%కి తగ్గిపోయింది. 
► కేంద్రం సెస్‌లు, సర్‌ చార్జీల ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని మాత్రం ప్రణాళికాబద్ధంగా తగ్గిస్తోంది. 
► 2014–19 మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60% అధికంగా అప్పులు చేయగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు ఏకంగా 117.42% అప్పులు చేసింది. సీఏజీఆర్‌ (కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌) అప్పులు చంద్రబాబు హయాంలో 16.8%కి పెరిగాయి. 
టీడీపీ సర్కారు ఖర్చు చేసిన రూ.1,62,828 కోట్లకు లెక్కలు లేవని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఆ పార్టీ ఎంపీకే పార్లమెంట్‌లో చెప్పింది. 
► 2019–22 మధ్య కేంద్ర ప్రభుత్వం అప్పులు 49.6% పెరగ్గా వైఎస్సార్‌సీపీ పాలనలో 43% మాత్రమే పెరిగాయి. సీఏజీఆర్‌ అప్పులు 12.75% మాత్రమే పెరిగాయి. 
► కోవిడ్‌ కష్ట కాలంలో పేదలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంది. మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.1.62 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో 1.68 కోట్ల కుటుంబాలకు గానూ 1.4 కోట్ల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 
► 2020–21లో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.10,14,373 కోట్లు కాగా 2021–22 నాటికి రూ.12,01,736కి పెరిగింది. ఈ ఆర్థిక ఏడాది రూ.13,38,575 కోట్లకు చేరుకుంటుందని అంచనా. జీవీఏ (గ్రాస్‌ వాల్యూ ఎడిషన్‌ ) రాష్ట్ర విభజన తరువాత అత్యధికంగా 2021–22లో 18.47% పెరిగింది. 
► సులభతర వాణిజ్యం (ఈవోడీబీ)లో ఏపీ దేశంలోనే ప్ర«థమ స్థానంలో నిలిచింది. 

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం: మిథున్‌రెడ్డి
ఏపీ విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. సచివాలయాల వ్యవస్థ, ఆర్బీకేలను కేంద్రం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. వలంటీర్‌ వ్యవస్థను చత్తీస్‌గఢ్, అసోం, యూపీ లాంటి రాష్ట్రాలు అధ్యయనం చేసి ప్రారంభించాయి. వాటర్‌గ్రిడ్‌ పథకానికి రూ.9 వేల కోట్ల వ్యయంతో టెండర్లు పిలవగా సీఎం జగన్‌ సూచనల మేరకు ఎంపీలంతా కృషి చేయడంతో కేంద్రం సానుకూలంగా స్పందించి దాదాపు రూ.4,500 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం, ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగుతో కలుషితమైన ప్రాంతాలకు వాటర్‌గ్రిడ్‌ పథకం ద్వారా మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పంచాయతీరాజ్, ఉపాధి హామీ నిధులు పెద్ద ఎత్తున సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం.  

మరిన్ని వార్తలు