రాష్ట్రపతులు, ప్రధానుల ఎంపికలో చంద్రబాబు పాత్ర శూన్యం

26 Jul, 2022 04:50 IST|Sakshi
ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నమస్కరిస్తున్న విజయసాయిరెడ్డి

దేవెగౌడ, గుజ్రాల్‌ ఎంపికలో బాబుది నిర్ణాయక పాత్ర కాదు: విజయసాయిరెడ్డి

నాడు కమ్యూనిస్టు అగ్ర నేతల సహాయకుడిగా ఢిల్లీలో తిరిగారు

రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం ఎంపికలో ములాయం చురుకైన పాత్ర 

సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతులు, ప్రధానుల ఎంపికలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర శూన్యమని వైఎస్సార్‌పీపీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రధాని నుంచి 2002లో రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం ఎంపిక దాకా అందరినీ ఒప్పించే విషయంలో చంద్రబాబు పాత్ర లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రధానులు హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్, రాష్ట్రపతులు అబ్దుల్‌ కలాం, ప్రతిభా పాటిల్‌ ఎంపికలో తాను క్రియాశీల పాత్ర పోషించినట్లు చంద్రబాబు చాలాసార్లు గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి చంద్రబాబుకు ఢిల్లీ ప్రధాన వీధులు పరిచయమైంది 1996లోనే అని గుర్తు చేశారు. 

ములాయం కీలక పాత్ర
‘లోక్‌సభ ఎన్నికల తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రధాని ఎంపికలో అప్పటి సీపీఎం ప్రధాన కార్యదర్శి హర్‌కిషన్‌సింగ్‌ సుర్జీత్‌ ప్రధాన పాత్ర నిర్వహించారు. వయోవృద్ధుడైన సుర్జీత్‌ సహాయ కుడి పాత్రలో చంద్రబాబు ఆయన వెంట రెండు రోజుల పాటు ఢిల్లీలో తిరిగారు. ఇద్దరు ప్రధానులు దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌ ఎంపికలో చంద్రబాబుది నిర్ణాయక పాత్ర కాదు. 2002లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఏపీజే అబ్దుల్‌ కలాం ఎంపికలో సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ చురుకైన పాత్ర పోషించారు.

కలాం అభ్యర్థిత్వం విషయం గురించి చంద్రబాబు కొందరు నేతలకు కేవలం ఫోన్‌లో సమాచారం మాత్రం ఇచ్చారు. దీనికి సంబంధించి ఏ నేతనూ ఒప్పించే బాధ్యతను నాటి ప్రధాని వాజ్‌పేయీ చంద్రబాబుకు అప్పగించ లేదు. ఇక 2007లో రాష్ట్రపతి పదవికి ప్రతిభా పాటిల్‌ ఎంపిక పూర్తిగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ, బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్‌ పార్టీల అంతర్గత వ్యవహారం. ఇందులో తలదూర్చే అవకాశం చంద్రబాబుకు ఏమాత్రం దక్కలేదు. 2012లో ప్రణబ్‌ ముఖర్జీ కాంగ్రెస్‌ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు సైతం ఆ నిర్ణయం పూర్తిగా సోనియాగాంధీనే తీసుకున్నారు’ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.   

మరిన్ని వార్తలు