కేసీఆర్‌ సోనియా కాళ్ల మీద పడ్డారు: విజయశాంతి

7 Dec, 2020 14:13 IST|Sakshi

బీజేపీలో చేరిన సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. కేవలం తన కుటుంబం మాత్రమే బాగుపడాలనే స్వార్థం ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును గద్దె దింపేది తామేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి సోమవారం బీజేపీలో చేరారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ.. ‘‘1998లో బీజేపీలో చేరాను. కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని 2005లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాను. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి అనేక సమస్యలపై పోరాటం చేశాను.

అప్పుడు నా పార్టీనీ టీఆర్‌ఎస్‌లో విలీనం చేయమని అడిగారు. నిజానికి నేను 1998లోనే తెలంగాణ పోరాటం మొదలు పెట్టాను. టీఆర్‌ఎస్‌ కంటే ముందు నేను తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాను. కేసీఆర్‌ కుట్రతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’’ అని రాములమ్మ చెప్పుకొచ్చారు. ఇక టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తీరును ప్రస్తావిస్తూ.. ‘‘ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్‌ పార్లమెంట్‌లో లేరు. ఆయన సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో తన కుటుంబం మాత్రమే ఎదగాలనే స్వార్థం కేసీఆర్‌ది.

కాంగ్రెస్‌ పార్టీ అసలు సమస్యలపై పోరాటం చేయడం లేదు. కాంగ్రెస్‌కు ఆయన స్లో పాయిజన్ ఎక్కించారు. కాంగ్రెస్ పోరాడలేని స్థితికి చేరుకుంది. ఏడాది కిందటే బీజేపీలో చేరాలని అనుకున్నా.కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం.పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా. తెలంగాణ ప్రజలు బాగు పడడమే నాకు కావాలి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే’’ అని విజయశాంతి పేర్కొన్నారు. కాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కె.లక్ష్మణ్‌, వివేక్‌ వెంకటస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: ‘తెలంగాణలో దూకుడు పెంచండి’)

మరిన్ని వార్తలు