ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు: కల్వకుంట్ల కవితకు విజయశాంతి సానుభూతి!

15 Sep, 2023 07:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ఈ స్కామ్‌ కేసులో ఈడీ నోటీసులు మరోసారి అందుకున్న బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల సానుభూతి ప్రకటించారు విజయశాంతి. 

ఒక ఆడబిడ్డకు కష్టం రావొద్దు. ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా  కోరుకుంటాను అంటూ పేర్కొన్నారామె. అయితే.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమేనని కవిత పేర్కొనడాన్ని విజయశాంతి తప్పుబట్టారు. 

 ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు.. ఆ ఆవశ్యకత కూడా లేదు అంటూ వివరణ ఇచ్చారు.  దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. 

ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే.. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అనే భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ, జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు అని పేర్కొన్నారామె.  

గతంలోఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు..  బీఆర్‌ఎస్‌ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నదంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారామె. 

ఇదిలా ఉంటే.. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్‌రామచంద్ర పిళ్లై మళ్లీ అప్రూవర్‌గా మారడం.. న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇవ్వడం.. ఆ వెంటనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం అంతా ఏడాది కాలంగా..  ఏదో టీవీ సీరియల్‌లాగా సాగుతోందని.. ఇవి ఈడీ నోటీసులు కావు మోదీ నోటీసులు అని, కేవలం తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల నేపథ్యంతోనే మరోసారి రాజకీయం కోసం నోటీసులు పంపారంటూ కవిత స్పందించారు. తన లీగల్‌ టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నోటీసుల వ్యవహారంపై పూర్తిస్థాయి స్పందన తెలియజేస్తానని ఆమె అన్నారు.

వాస్తవం కాదు: పిళ్లై లాయర్లు
ఇదిలా ఉంటే.. మరోవైపు తాను అప్రూవర్‌గా మారలేదంటూ అరుణ్‌ రామచంద్ర పిళ్లై తన న్యాయవాదుల నుంచి ఒక ప్రకటన విడుదల చేయించడం గమనార్హం. సీఆర్పీసీ సెక్షన్‌ 164 కింద పిళ్‌లై ఎలాంటి వాంగ్మూలం న్యాయమూర్తి ఎదుట ఇవ్వలేదని, తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్నారని, సదరు సంస్థలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పిళ్లై తరపు న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.   

మరిన్ని వార్తలు