బెజవాడ టీడీపీకి ఏమైంది?.. మళ్లీ కొత్త రగడ!

5 Feb, 2023 16:47 IST|Sakshi

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉందంటే ఉందని అనుకోవడమే గాని.. అక్కడ 1983 తర్వాత పచ్చ జెండా ఎగిరింది లేదు. వామపక్షాలతో పొత్తు కుదిరినపుడు గెలిస్తే సీపీఐ అభ్యర్థి.. లేదంటే అప్పట్లో కాంగ్రెస్ నేతలు గెలిచేవారు. గత రెండుసార్లుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జెండానే పశ్చిమలో ఎగురుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇప్పుడు పచ్చ పార్టీలో పంచాయతీ నడుస్తోంది.

పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ కేశినేని నానితో లోకల్ లీడర్లకు అసలు పడటంలేదు. చాన్నాళ్లుగా ఈ గొడవ పచ్చ పార్టీలో నడుస్తూనే ఉంది. రాబోయే ఎన్నికల్లో బెజవాడ వెస్ట్ టిక్కెట్ అభ్యర్థి విషయంలో ఎంపీ కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబును కలవడంపై ఇప్పుడు కొత్తగా రగడ మొదలైందట. 1983 తర్వాత పశ్చిమ సీటును మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ జెండా ఈసారి ఎలాగైనా  ఎగరేయాలని చంద్రబాబు కలగంటున్నారట.

తమ్ముళ్లే కుమ్మేసుకుంటున్నారు
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జిగా ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచి కేశినేనికి బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో పడటంలేదని టాక్. వీరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయి... మూడున్నరేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయట పశ్చిమ పార్టీలో పరిస్థితులు. కొన్నాళ్లుగా తన సోదరుడు కేశినేని శివనాధ్ పార్టీలో యాక్టివ్ కావడంతో కేశినేని నాని ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పార్టీ అధినేత తనకు అధికారం ఇవ్వడంతో ఈ సెగ్మెంట్‌లో దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.

నాని ట్రావెల్స్‌కు స్టాప్‌ లేదా?
తనతో ఒకప్పుడు టచ్ లో ఉన్న నేతలందరినీ కలుపుకుని పోతూ ఇటీవల వరుసగా కార్యక్రమాలు చేస్తూ హడావిడి చేస్తున్నారట కేశినేని నాని. ఈ క్రమంలో వయోభారంతో మొన్నటి వరకూ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న జలీల్ ఖాన్ సైతం ప్రస్తుతం యాక్టివ్ అయ్యారు. జలీల్‌ఖాన్ ఇప్పుడు కేశినేని నాని వెంట తిరుగుతుండటంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

మూలన ఉన్న నేత బయటకు రావడం వరకు బానే ఉంది. అయితే తాజాగా కేశినేని నాని తన అనుచరుడైన ఎం.కె.బేగ్ ను వెంటబెట్టుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్లడంతో పశ్చిమ టీడీపీలో కొత్త చిచ్చు రాజేసిందట. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు వెళ్లిన కేశినేని నాని ఈసారి పశ్చిమ టిక్కెట్టు ఎం.కె. బేగ్ కు ఇవ్వాలంటూ చంద్రబాబును కోరినట్లు సమాచారం.
చదవండి: ఏది నిజం ?: సీబీఐ నుంచి రామోజీ ‘లై’వ్‌ రిపోర్టింగ్‌

నాలుగో కృష్ణుడి ఎంట్రీ
ఈ విషయం బయటికి తెలియడంతో ఇప్పుడు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో పాటు జలీల్ ఖాన్ కూడా నాని పై గుర్రుగా ఉన్నారట. గత ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుమార్తె టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా తన కుటుంబానికే సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న జలీల్ ఖాన్ కు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదట. విదేశాల్లో ఉంటూ ఎన్నికలకు ఏడాది ముందు వచ్చి హడావిడి చేసే ఎం.కె.బేగ్ కు టిక్కెట్ ఇవ్వాలని నాని అడగటంపై లోలోన ఉడికిపోతున్నారట.

నిన్న మొన్నటి వరకూ కేశినేని నాని అంటే పీకల్లోతు కోపం ఉన్న బుద్ధా వెంకన్న , నాగుల్ మీరాల సరసన ఇప్పుడు జలీల్ ఖాన్ కూడా చేరిపోయారన్న చర్చ జరుగుతోంది. ఇక వెస్ట్ తమ్ముళ్లు మాత్రం ఇప్పటికి ముగ్గురు కృష్ణులు అయిపోయారు ... ఇక నాలుగో కృష్ణుడు వచ్చాడంటూ సెటైర్లు వేసుకుంటున్నారట.
పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు