నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తల వీరంగం 

17 Feb, 2021 13:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ తూర్పు: ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో రాజకీయ విలువలకు విరుద్దంగా టీడీపీ నాయకులు నడిరోడ్డుపై రచ్చ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం..  తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్‌కు టీడీపీ తరుపున కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండపనేని వాణి, అదే పార్టీకి చెందిన బొండా ఉమా అనుచరుడైన కోనేరు వాసుకు కొన్నేళ్లుగా ఆస్తి, సరిహద్దు వివాదం కొనసాగుతుంది. గుణదలలోని పంచాయతీ కార్యాలయం వద్ద  ఉన్నటువంటి ఆస్తికి ఎప్పటి నుంచో సరిహద్దు తగాదాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం రాత్రి మరో మారు ఇరు వర్గాల మధ్య తగాదా మొదలైంది. వివాదం పెరిగి పెద్దది కావడంతో కొండపనేని వాణి కుమారుడు శ్రీకాంత్, కోనేరు వాసులు పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై మరోకరు నడిరోడ్డుపై దాడులకు పాల్పడ్డారు. కాగా స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు అదే సమయంలో వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి భీమిశెట్టి ప్రవల్లిక పర్యటన కొనసాగుతుంది.

ఇంటింటికి తిరుగుతూ స్థానికులను కలుస్తూ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ప్రచారంలో ఉన్నారు. టీడీపీ నాయకుల మధ్య రేగిన గొడవను రాజకీయం చేస్తూ వైఎస్సార్‌ సీపీ నాయకులపై రుద్దే ప్రయత్నం చేశారు. దీనికి వత్తాసు పలుకుతూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు తమ కార్యకర్తలు చేసిన రచ్చను సమర్ధించారు.  ఏ ప్రమేయం లేకపోయినా వైఎస్సార్‌ సీపీ నాయకులు గొడవకు కారణమంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ మేరకు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా టీడీపీ అభ్యర్థి వాణిని ప్రోత్సహించారు. వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల నేప«థ్యంలో టీడీపీ నాయకులు తమపై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికలలో ఏలా అయినా గెలుపొందాలనే దురుద్దేశంతో టీడీపీ నాయులు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతుండటం చర్చనీయాంశంగా మారింది..  

విజయవాడ టీడీపీలో చీలిక
‘మీరంతా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అటో.. ఇటో.. ఎటో.. నిర్ణయించుకోండి. ఉంటే మాతో ఉండండి. లేదా ఎంపీతోనైనా వెళ్లిపోండి. ఏదో ఒక వైపు మాత్రమే నిలవాలి. అటూ ఇటూ రెండువైపులా ఉంటామంటే ఇక ఏమాత్రం కుదరదు. ఇందులో మొహమాటం ఏమీలేదు’ అని విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాలు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులకు హకుం జారీచేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ పేరిట వారివురు కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి 18 మంది కార్పొరేట్‌ అభ్యర్థులు, 19 మంది పార్టీ డివిజన్‌ అధ్యక్షులు హాజరయ్యారు.  

టార్గెట్‌ కేశినేని.. 
ప్రధానంగా ఎంపీని లక్ష్యంగా చేసుకుని సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా మరో సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ సమావేశానికి గైర్హాజరు కావడంతో పాటు కేశినేని భవన్‌లో ఎంపీ కేశినేని నానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌ కూడా ఎంపీని ప్రత్యేకంగా కలవడం నగర టీడీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.  

లోకేష్‌ జోక్యంతోనే.. 
విజయవాడ టీడీపీ నాయకులు గ్రూపు తగాదాలతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికల నగారా మరింత అగ్గి రాజేసింది. అధిష్టానం ఆశీస్సులతో, ముఖ్యంగా లోకేష్‌ జోక్యంతోనే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ పరిస్థితులను ఎంపీ కేశినేని నాని వర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. 

పెత్తనాన్ని జీర్ణించుకోలేక.. 
పశ్చిమంలో టీడీపీ నాయకత్వం అక్కడి సీనియర్‌ నాయకులైన బుద్దా, జలీల్, మీరాలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అప్పగించకపోగా నియోజకవర్గాన్ని సమన్వయ పరచుకోవాలని ఎంపీ కేశినేనికి గతంలో సూచించారు. దీంతో డివిజన్‌ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఎంపీ కనుసన్నల్లోనే జరిగింది. తమ నియోజకవర్గంలో కేశినేని పెత్తనాన్ని జీర్ణించుకోలేని బుద్దా, మీరాలు సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బొండా ఉమా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లతో చేతులు కలిపారు. సీనియర్‌ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, ఇటీవలి కాలంలో లోకేష్‌తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న కొమ్మారెడ్డి పట్టాభిరాంలు కూడా పై గ్రూపుతో జతకట్టారు. కేశినేనికి ఇవన్నీ జీర్ణించుకోలేని పరిణామాలుగా మారాయి.  

మాకే అధిష్టానం మద్దతు 
‘మన నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్జీలు అధిక శాతంలో ఉన్నారు. వారొచ్చి మనపై పెత్తనం చేస్తామంటే మనం ఎందుకు అంగీకరించాలి’ అని బుద్ధా, మీరాలు ప్రశ్నించినట్లు తెలిసింది. శ్వేతను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించలేదని చెబుతూ.. అధిష్టానం ఆశీస్సులు లేకపోతే మేం ఈ సమావేశాన్ని నిర్వహించగలమా అని నాయకులు ఇరువురూ ప్రస్తావించినట్లు సమాచారం. గూండారపు హరిబాబు కూతురు పూజిత గెలవలేదని, ఆమె స్థానంలో శివశర్మను పోటీలో నిలపాలని ఎంపీ కేశినేని ప్రతిపాదిస్తున్నారని చర్చకు లేవనెత్తగా ఆయన కార్పొరేట్‌ అభ్యర్థులు అందర్నీ గెలిపించగలరా అని నాయకులు ఎద్దేవా చేశారని తెలిసింది. 

పశ్చిమ నేతల భేటీలో..  
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ నాయకులతో భేటీ అయిన బుద్దా, మీరాలు తమ అజెండాను స్పష్టంగా వెల్లడించారు. ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతను మేయర్‌ అభ్యర్థిగా పార్టీ అధినేత ప్రకటించలేదని, ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు తమందరి సమక్షంలో వెల్లడించారని స్పష్టం చేశారు. శ్వేత పేరు ఎంపీ స్వయం ప్రకటితమని, ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు. మేయర్‌ అభ్యర్థి ఫలానా వారని తేలిన పక్షంలో తమ ఎన్నికల ఖర్చుకు ఇస్తారని ఒకరిద్దరు ప్రస్తావించగా ఎంపీ కేశినేని ఇచ్చే మొత్తం కన్నా తాము రెండింతలు ఎక్కువగానే సమకూర్చుతామని బుద్దా, మీరాలు పోటీదారులకు భరోసా ఇచ్చారని ‘సాక్షి’కి అభ్యర్థులు తెలిపారు.  

మరిన్ని వార్తలు