Mamata Banerjee: బీజేపీకి రాజకీయ ప్రాణవాయువు అవసరం

5 May, 2021 01:05 IST|Sakshi

తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్య

బీజేపీని ఓడించవచ్చని బెంగాల్‌ చూపించింది 

హింసకు బీజేపీయే కారణం 

కోల్‌కతా: బీజేపీ అజేయశక్తి కాదని, ఆ పార్టీని ఓడించవచ్చని బెంగాల్‌ ఎన్నికలు నిరూపించాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ... ప్రజలకు ఆక్సిజన్‌ అందివ్వడం లేదు. కానీ ఇప్పుడు బీజేపీకే రాజకీయ ప్రాణవాయువు అవసరం’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 213 సీట్లను నెగ్గి ఘనవిజయం సాధించిన మమత బుధవారం వరుసగా మూడోసారి బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. ఫలితాల అనంతరం బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు బీజేపీయే కారణమని ఆరోపించారు. అవమానకరమైన ఓటమి నుంచి దృష్టి మరల్చడానికి... మతఘర్షణలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ మతతత్వపార్టీ అన్నారు. ‘బీజేపీని ఓడించొచ్చు. మనది ప్రజాస్వామ్యదేశం. ప్రజల అభీష్టమే అంతిమం. బెంగాలీలు మార్గాన్ని చూయించారు. ప్రజాస్వామ్యంలో లెక్కలేనితనం, అహం పనికిరాదు. ఎన్నికల సంఘం రాజధర్మాన్ని పాటించి.. ఒక్క బీజేపీకే కాకుండా అన్ని పార్టీలకు అండగా నిలవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మమత అన్నారు.  

ఏజెన్సీ రాజకీయాలకు తెరపడాలి 
దర్యాప్తు సంస్థలను, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సమాఖ్య వ్యవస్థను రూపుమాపాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘ఏజెన్సీ రాజకీయాల (సీబీఐ, ఈడీలను ప్రత్యర్థులపై వాడటం)కు తెరపడాలి. అప్పుడే నరేంద్ర మోదీ– అమిత్‌ షా రాజకీయశకం ముగుస్తుంది. ఈ తరహా రాజకీయాలు దేశానికి అవసరం లేదు. మోదీ, షాల కంటే సమర్థులైన అభ్యర్థులు ఎందరో ఉన్నారు’ అని దీదీ అన్నారు.

2024లో పత్రిపక్షాల ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వస్తారా? అని ప్రశ్నించినపుడు మమత ఆచితూచి స్పందించారు. ‘ఇప్పటికిప్పుడు అన్నీ నిర్ణయించలేం. కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌ అంటూ ఒకటి ఉండాలి. ఇది కోవిడ్‌పై పోరాడాల్సిన సమయం. పరిస్థితులు చక్కబడ్డాక దానిపై దృష్టి పెడతాం. ఒక నిపుణుల బృందాన్ని నియమిస్తాం. వాళ్లు మాకు మార్గనిర్దేశం చేస్తారు. ఏదో ఒకటి దానంతటదే జరుగుతుంది. ఎందుకంటే దేశం ఈ విపత్తును ఎదుర్కొనలేదు. బీజేపీ అంటేనే ఓ విపత్తు’ అని మమత వ్యాఖ్యానించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు