ఎన్నికలు ఫలితాలు.. రణరంగాన్ని తలపిస్తున్న వెస్ట్‌ బెంగాల్‌

4 May, 2021 08:06 IST|Sakshi

 బెంగాల్‌లో ఫలితాల అనంతరం హింస

తమ వారు చనిపోయారంటున్న టీఎంసీ, బీజేపీ

రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన కేంద్రం, గవర్నర్‌ 

 ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరిన సీఎం మమత

కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.  అధికార టీఎంసీ దాడుల్లో తమ పార్టీ కార్యకర్తలు పలువురు మృతి చెందడం, గాయపడటం జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రతిపక్ష కార్యకర్తలపై దాడుల ఘటనలపై నివేదిక అందించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచిన ప్రాంతాల్లో బీజేపీ సహా పలు రాజకీ య పార్టీల కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరిగాయనీ, దీనిపై నివేదిక అడిగినట్లు హోం శాఖ ప్రతినిధి ఒకరు ట్విట్టర్‌లో తెలిపారు. బుర్ద్వాన్‌లో టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల నడుమ ఆది, సోమవారాల్లో జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు తమ కార్యకర్తలేనంటూ టీఎంసీ ప్రకటించింది.

కాగా, ప్రత్యర్థుల దాడిలో నందిగ్రామ్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయం తగులబడి పోతుండగా, ప్రజలు పరుగులు తీస్తున్నట్లున్న వీడియోను ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. దాడుల్లో చనిపోయిన పార్టీ కార్యకర్తలు నలుగురితోపాటు దుస్తుల దుకాణాన్ని లూటీ చేస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. తృణమూల్‌ శ్రేణుల దాడుల్లో తమ పార్టీ మద్దతుదారులు ఆరుగురు చనిపోగా, వారిలో ఒక మహిళ కూడా ఉన్నారని బీజేపీ ఆరోపించింది.అయితే  మహిళ మరణంపై ఆయన కుమారుడు, స్థానిక బీజేపీ నాయకుడు ఆశిష్ క్షేత్రపాల్ మాట్లాడుతూ..ఉదయం 11 గంటల సమయంలో టీఎంసీ కార్యకర్తలు ఖేలాహోబ్ (ఆట మొదలైంది) నినాదాలు చేస్తూ దాడులకు తెగబడ్డారు. మేం ప్రతిఘటించడంతో టీఎంసీ మద్దతుదారులు పారిపోయి దొడ్డిదారిన నా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న నా కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో నా తల్లి మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి అనంతరం మా ప్రాంతానికి చెందిన 17-18 ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున‍్నారని చెప్పారు.    

కాగా, హింసాత్మక ఘటనలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో, తమ పార్టీ కార్యకర్తలను ప్రశాంతంగా ఉండాలంటూ సీఎం మమతా బెనర్జీ కోరారు. రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా బీజేపీ కార్యకర్తలు టీఎంసీ మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో రెండు రోజులపాటు మకాం వేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం రానున్నారు.
చదవండి: పెళ్లి 3 గంటల్లో పూర్తవ్వాలి, 31 మందికే చాన్స్‌, లేదంటే..

మరిన్ని వార్తలు