రాష్ట్ర ప్రజలు ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారు..

18 Jan, 2021 21:01 IST|Sakshi

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలతో పాటు మేనిఫెస్టోలో పొందుపరచని మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రజల తలరాతలను మార్చారని కొనియాడారు. పేదల కలలను సాకారం చేసేందుకు సీఎం జగన్‌ అహర్నిశలు కృషి చేస్తుంటే.. కొన్ని దృష్ట శక్తులు అదే పనిగా అడ్డుతగులుతున్నాయని ఆయన ఆరోపించారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు చేయలేని అభివృద్ధిని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేవలం పద్దెనిమిది నెలల్లోనే చేసి చూపించారని ఆయన ప్రశంశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు అండ్‌ కో మోకాలడ్డుతున్నా, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉక్కుసంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. తన నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇ‍వ్వలేకపోయిన దేవినేని ఉమ.. ఇళ్ల పట్టాల పంపిణీపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 

అధికారంలో రావడం అసాధ్యమని తెలుసుకున్న చంద్రబాబు.. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తిస్తూ, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సామినేని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు, రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేస్తుంటే.. చంద్రబాబు ఎండ్‌ కో మత విద్వేశాలు రెచ్చగొట్టడంలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది: మోపిదేవి

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలై పాతిక రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొని ఉందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. 31 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు ,అవసరాలు అవపోసన పట్టి ముఖ్యమంత్రి.. వాటిని పరిష్కరించేందుకు కంకణం కట్టుకున్నారని ఆకాశానికెత్తారు . 

ఖజానా ఖాళీ అవుతున్నా పేదల అవసరాలు తీర్చే విషయంలో సీఎం జగన్‌ వెనకడుగు వేయడం లేదని ఆయన ప్రశంశించారు. అంబేడ్కర్ ఆశయాల సాధన, సామాజిక వర్గాల సమతుల్యతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర పతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి తన ఉనికిని కాపాడుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు