బీసీలందరూ జగన్‌ వెంటే ఉన్నారు 

23 Sep, 2022 06:50 IST|Sakshi

చంద్రబాబుకు ఇన్నాళ్లకు బీసీలు గుర్తుకొచ్చారా? 

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ 

భవానీపురం (విజయవాడ పశ్చిమ): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇన్నాళ్లకు బీసీలు గుర్తొచ్చారా అని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌ ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ కులాలు గుర్తుకు రాలేదని నిలదీశారు. గురువారం విజయవాడ గొల్లపూడిలో ఉన్న బీసీ సంక్షేమ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లూ బీసీల పార్టీ అని చెప్పుకుని ఓట్లు దండుకుని అధికారంలోకి వచి్చన తరువాత వారిని మోసం చేసిన చంద్రబాబు పెట్టాల్సింది సాధికార సభలు కాదని, బీసీలకు బహిరంగ క్షమాపణ సభలని అన్నారు.

రాష్ట్రంలో బీసీలందరూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉన్నారని స్పష్టంచేశారు. జనరల్‌ స్థానాల్లో బీసీలకు మేయర్, జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బీసీల పక్షపాతిగా నిలిచారని అన్నారు. బీసీ మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్‌ కల్పించటం ద్వారా వారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనటం రాజకీయ చైతన్యం కాదా అని ప్రశ్నించారు.

వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే బీసీల స్థితిగతులపై అధ్యయన కమిటీ వేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కులాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారని, ఆ పని మీరు ఎందుకు చేయలేక పోయారని చంద్రబాబును ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా బీసీ ఉద్యమాల్లో ఉన్న ఆర్‌ కృష్ణయ్యను ఎన్నికల్లో వాడుకుని చంద్రబాబు వదిలేస్తే ఆయన్ని రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగనన్నకు దక్కుతుందన్నారు.  

మరిన్ని వార్తలు